మనిషి అభివృద్ధి పేరుతో తనకు అండగా నిలబడుతున్న ప్రకృతి గురించి మరచిపోతున్నాడు. ముఖ్యంగా మనిషి మనుగడకు కారణమవుతున్న చెట్లను నాశనం చేస్తున్నాడు. దీని వల్ల వర్షాలు లేక ఒక వైపు, కాలుష్యం పెరిగి మరో వైపు భూమి నాశం అవుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ..సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మాతలుగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. `సింబా` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. సినిమా టైటిల్, కాన్సెప్ట్ తదితర విషయాలను వివరిస్తూ చిత్ర యూనిట్ సోమవారం ఓ వీడియో ప్రోమోను విడుదల చేసింది.
వీడియో ప్రోమోను గమనిస్తే.. కొందరు మనుషులు అడవిలోని చెట్లను నరికేస్తున్నారు. అడవి పాడవుతుండటంతో జంతువులన్నీ భయంతో పారిపోతున్నాయి. అయితే అంతలో మన కథానాయకుడు `సింబా` చెట్టు నరుకుతున్న వాడిపైకి నరికిన చెట్టును ఆయుధంగా చేసుకుని దాడి చేస్తాడు. `మనకు బ్రతుకునిచ్చే మొక్కని బ్రతకనిద్దాం` అనే లైన్ ద్వారా సినిమా, హీరో పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు.
`ది ఫారెస్ట్ మ్యాన్` ట్యాగ్ లైన్‌తో మానవ మేథస్సు సంబంధిత సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న `సింబా` ఒకవైపు మంచి మెసేజ్‌తో పాటు విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. డైరెక్టర్, నిర్మాత సంపత్ నంది, ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తుండటం విశేషం. హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.