ఆర్ఆర్ఆర్ సినిమా తమిళ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి తమిళ సినీ హీరోలు ఉదయనిధి, శివకార్తికేయన్, నిర్మాతలు థాను, ఆర్బీ చౌదరి, తమిళ లిరిక్ రైటర్ మదన్ కార్కీ తదితరులు విచ్చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రం కథ భారత గడ్డపై పుట్టిన ఓ భావోద్వేగం అని అభివర్ణించారు. రెండు ఫిరంగుల్లాంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని కితాబు ఇచ్చారు.
ఎన్టీఆర్‌ను మిత్రుడిగా పేర్కొన్న రాజమౌళి... రామ్ చరణ్‌ను తన శిష్యుడిగా అభివర్ణించారు. అయితే వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా ఉండడం ఎలాగో రామ్ చరణ్ నుంచి తాను నేర్చుకుంటానని సభాముఖంగా తెలిపారు.
"నేను ఎన్టీఆర్ ను తిడుతుంటాను. టైమ్ సెన్స్ ఉండదు. నేను 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు. నేను ఏదైనా మనసులో ఓ సీన్ అనుకుంటే, చెప్పకముందే చేసి చూపిస్తాడు. తెలుగు తెరకే కాదు భారతీయ చిత్ర పరిశ్రమకే ఎన్టీఆర్ ఓ వరంలాంటివాడు. ఇక చరణ్‌ను ఎక్కువగా మై హీరో అంటుంటాను.
చరణ్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే... సినిమా కోసం ఎంత కావాలన్నా చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఓ ధ్యానంలో ఉన్నట్టుగా ఎంతో నిర్మలమైన మనసుతో ఉంటాడు. వాస్తవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ భిన్న ధృవాల్లాంటి వాళ్లు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఓ లక్ష్యం కోసం దూసుకుపోతున్న వ్యక్తిలా కనిపిస్తాడు. రామ్‌చరణ్ కచ్చితమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంలా కనిపిస్తాడు" అని వివరించారు.
సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమది అన్నదమ్ముల అనుబంధం అని, తాను మరణించే వరకు తమ అనుబంధం చెదిరిపోనివ్వనని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి సీను మళ్లీ నటించడానికి తాను సిద్ధమని, అందుకు కారణం చరణ్‌తో మళ్లీ సమయం గడిపే వీలుంటుందని అన్నాడు.