జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు. ఏపీ సర్కారుపై పవన్ విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో పోసాని మధ్యలో దూరి, పవన్‌ను తిట్టారు. ఏపీ సీఎం జగన్‌తో పోల్చుకునేంత వ్యక్తిత్వం నీకుందా పవన్? అంటూ ప్రశ్నించారు.
ఇదే అంశంపై పోసాని మాట్లాడుతూ, 'చిరంజీవి గతంలో ఏనాడైనా, ఎవర్నైనా అనవసరంగా ఒక్క మాట మాట్లాడారా? కానీ సినిమా ఫంక్షన్‌లో పవన్ వాడిన భాష బాగాలేదు. తప్పు చేస్తే ఎవర్నైనా ప్రశ్నించవచ్చు. కానీ ఆధారాల్లేకుండా సీఎంను, మంత్రులను తిట్టడం మంచిదికాదు.
జగన్‌కు కులపిచ్చి ఉందని పవన్ నిరూపించగలరా? చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై ఎందుకు పవన్ ప్రశ్నించడంలేదు? ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు ఇబ్బందిపెట్టడం పవన్‌కు తెలియదా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందనుకుంటున్నావా పవన్ కల్యాణ్?' అంటూ పోసాని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతేకాకుండా, జగన్ పనితీరు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది, నువ్వెలాంటివాడివో తెలుసుకున్నారు కాబట్టే రెండు చోట్లా నిన్ను ఓడించి పంపారు అంటూ విమర్శించారు. సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఎదగాలని ఎన్నో వందల కలలతో ఓ పంజాబీ అమ్మాయి వచ్చిందని, కానీ అవకాశాల పేరుతో ఓ సెలబ్రిటీ ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ మోసాన్ని బయటపెడితే చంపేస్తానని కూడా బెదిరించాడని వివరించారు. ఆ అభాగ్యురాలికి న్యాయం చేస్తే పవన్‌కు గుడికడతానని, పూజలు చేస్తానని అన్నారు. ఆ బాధితురాలికి న్యాయం చేయలేకపోతే ఏపీ మంత్రులను ప్రశ్నించే హక్కు పవన్‌కు లేనట్టేనని తన అభిప్రాయాలను వెల్లడించారు.
పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. తాను ఇలా మాట్లాడుతున్నందుకు చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించినా భయపడబోనని పోసాని ఉద్ఘాటించారు. పవన్ కల్యాణ్ ఎలాంటివాడో పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని పోసాని చెప్పుకొచ్చారు.