Nag Ashwin clapped director Anudeep K.V.
సినిమా ప్రారంభోత్సవంలో కథానాయకుడిపై క్లాప్ కొట్టడం ఆనవాయితీ. కానీ దర్శకుడిపై మరో దర్శకుడు క్లాప్ కొట్టడం వినూత్నంగా నేడు జరిగింది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ పై కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టిన అపురూప ద్రుశ్యం నేడు ఆవిష్కుతమైంది. వివరాల్లోకి వెళితే.. కథానాయకుడు విశ్వక్ సేన్ తో దర్శకుడు అనుదీప్ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అనుదీప్ కె.వి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి 'ఫంకీ' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లో నటీనటులు మరియు సాంకేతిక బృందం సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులతో, చూడగానే అందరి దృష్టిని ఆకర్షించేలా ఫంకీ టైటిల్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ టైటిల్ డిజైన్‌తో పాటు, పోస్టర్ మీద రాసి ఉన్న 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫంకీ సినిమా ప్రేమ, వినోదంతో కూడిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమనే భావన పోస్టర్ చూస్తే కలుగుతోంది.
విశ్వక్ సేన్, అనుదీప్ కలయికపై ఉండే అంచనాలకు తగ్గట్టుగా, ఫంకీ చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. వినోదాన్ని పంచడంలో దర్శకుడు అనుదీప్ ది విభిన్న శైలి. అలాంటి అనుదీప్ కి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రతిభగల నటుడు విశ్వక్ సేన్ తోడయ్యారు. ఈ ఇద్దరు కలిసి చిన్న పెద్ద అనే లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వుకునే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.
ఫంకీ చిత్రానిక. ప్రముఖ ఛాయగ్రాహకుడు సురేష్ సారంగం కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' చిత్రాలతో తన సంగీతంతో ఆకట్టుకొని, ప్రస్తుతం 'మాస్ జాతర', 'మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలకు పని చేస్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
2025 సంక్రాంతి తర్వాత ఫంకీ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.