నేను కంపోజ్ చేసిన పాటలు పాడొద్దు.. బాలుకు ఇళయరాజా నోటీసులు
తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కోర్టు నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది.
తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కోర్టు నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది. సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాల మధ్య ఇలాంటి విభేదాలు రావడం ఫ్యాన్స్ మధ్య కలవరపెడుతోంది. అలాగే గాయని చిత్ర, బాలు కుమారుడు చరణ్‌కు కూడా ఇళయ రాజా నోటీసులు పంపడం విశేషం.
తనకు నోటీసు అందిన విషయం నిజమేనని బాలసుబ్రహ్మణ్యం కూడా ధృవీకరించారు. 'ఇటీవల నేను టోరంటో, రష్యా, దుబాయ్ వంటి చోట్ల మ్యూజిక్ కన్సర్ట్‌లు నిర్వహించాను.. అయితే అమెరికాలో చేసిన కచేరీ విషయంలో మాత్రమే ఇళయ రాజా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు' అని బాలు తెలిపారు.
ఈ నోటీసుల నేపథ్యంలో తన ట్రూప్ ఇళయ రాజా పాటలను పాడబోదని, అయితే దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని బాలు తన ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.