సినిమారంగంలో ఎక్కడైనా సరే హీరోలదే పైచేయి. కథలో హీరోనే అందరినీ ఆడిస్తాడు. హీరోయిన్ జోకర్‌లా వున్న చిత్రాలు చాలనే వున్నాయి. రానురాను పరిస్థితుల వల్ల హీరోయిన్ కథాంశాలతోనే సినిమాలు వస్తున్నాయి. హీరో, హీరోయిన్ అనే తేడాలేకుండా ఇద్దరూ సమానంగా కథకు న్యాయం చేస్తున్నారు. హీరోయిన్లకు ఫేమ్ రాగానే కమర్షియల్ యాడ్‌లు చేసేవారు ఈగల్లా వాలిపోతున్నారు. హీరోలు ఈ విషయంలో ఒక అడుగడు ముందే వున్నారు. ఇప్పుడు కాలం మారింది. కరోనా తర్వాత దాదాపు అందరి మైండ్‌సెట్‌ను మార్చేసిందనే చెప్పాలి. ఇందుకు ఉదాహరణే ఇటీవలే హీరోయిన్‌లో వచ్చిన మార్పులు.
ఫలానా కూల్‌డ్రింక్ తాగితేనే మగాడు అనీ, లేదా ఎనర్జీ అంటూ బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్లుగా సినిమా వాళ్ళతో వ్యాపార ప్రకటనలు ఇచ్చేస్తున్నాడు కొన్ని కంపెనీలు. ఆమధ్య బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఓ కూల్‌డ్రింక్ తాగితే అప్పట్లో అది పెద్దగా మార్కెట్ చేసుకున్నారు కంపెనీలు కానీ ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో యాసిడ్‌కూడా దాగివుందనీ అది కడుపులోని ప్రేగులకు హాని చేస్తుందననీ, కావాలంటూ బాత్‌రూమ్‌లో పోసి చూడండి నీట్‌గా కడుతుందని నిజాలుతో చూపించారు కొన్ని పోరాట సంఘాలు. వారు అలా పోరాటం చేయడంతో అలాంటి ప్రకటల వివాదం సుప్రీం కోర్టువరకు వెళ్ళింది. అయినా ఇప్పుడు మరలా కొన్ని కూల్ డ్రింక్‌ల ప్రకటనలు వస్తూనే వున్నాయి. ఆకాశంపైనుంచి ఎగిరి కింద వున్న కూల్‌డ్రింక్ తీసుకోవడం, కొండలపైనుంచి జంప్ చేయడం వంటి ప్రకటనలు యూత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది పెద్దగా హీరోలు పట్టించుకోవడంలేదు. తమకు వచ్చిన కోట్ల రూపాయలనే వారు చూస్తున్నారు.
కానీ ఇలాంటివాటికి విరుద్ధంగా మహిళల ఆలోచన వుంది. సమాజానికి చేటు కలిగించే వ్యాపార ప్రకటనలో పాల్గొనకూడదని కొంతమంది హీరోయిన్లు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇటీవలే సాయి పల్లవి తనకు 2కోట్లు వస్తున్నా ఫెయిర్ నెస్ క్రీమ్ కు చేయనని చెప్పేసింది. అదే బాటలో కంగనా రనౌత్ లాగే ఇప్పుడు అవికా గోర్ ఫెయిర్ నెస్ క్రీమ్ కి బైబై చెప్పేశారు. క్రీమ్ రాసుకుంటే నల్లటివారు తెల్లగా మారతారని ఈ హీరోయిన్లు చెప్పాలి. దాన్ని చూసి యూత్ ఎగబడి కొనాలి. ప్రొడక్్ట సంస్థలు కోట్లు సంపాదించాలి. తీరా క్రీమ్ రాసుకున్నాక తేడా వస్తే దానికి ఎవరు బాధ్యులు అనేది చెప్పలేని స్థితి. దీనిపైనే సాయిపల్లవి గట్టిగా ప్రశ్నిస్తే ఆ సంస్థ నుంచి సరైన సమాధానం రాలేదు. సో. ఇలాంటి నిర్ణయాలు చాలా మంచి పరిణామాలని సోషల్‌మీడియాలో వారికి నెటిజన్లు ధన్యవాదాలు తెలియచెబుతున్నారు. మరోవైపు హీరోలు కూడా ఇలాంటి ఫేక్ ప్రకటనలను మానుకోవాలని, హీరోయిన్లను ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో