బాలయ్య చిత్రానికి పన్ను మినహాయింపు ఎలా ఇస్తారు.. సీఎం బంధువనా? : హైకోర్టులో పిటీషన్
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం వివాదాల్లో చిక్కకుంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయింపుపై హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. రాష్ట్రానికి చె
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం వివాదాల్లో చిక్కకుంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయింపుపై హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. రాష్ట్రానికి చెందిన న్యాయవాది ఆదర్శకుమార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
బాలకృష్ణ తన బంధువు అయినందుకే నిబంధనలకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్యాక్స్ మినహాయింపు ప్రేక్షకులకు ఉండాలి కానీ.. నిర్మాతలకు కాదని ఆదర్శకుమార్ తెలిపారు. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు పరిధిలోకి.. వస్తుందో రాదో కమిటీ వేసి పరిశీలించాలని పిటిషన్‌లో కోరారు.
ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను మినహాయింపు ఇచ్చినట్టయితే ఆ పన్నును నిర్మాత నుంచి రాబట్టుకోవచ్చని హైకోర్టు సూచన చేసింది. అదేసమయంలో ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయనీ, రెగ్యులర్ బెంచ్‌కు వెళ్లాలని పిటీషనర్‌కు న్యాయమూర్తి సూచన చేశారు.
కాగా, 'రుద్రమదేవి' దర్శకనిర్మాత గుణశేఖర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని గుణశేఖర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎపుడో లేఖ రాశారు. ఇది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి మాత్రం క్షణాల్లో వినోదపు పన్ను రాయితీ ఇస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం ఇపుడు వివాదాస్పదంగా మారింది.