అక్టోబర్ 22న విడుదలైన `నాట్యం` సినిమా ప్రమోషన్‌లో భాగంగా పి.ఆర్.ఓ.లు లక్షల్లో తమనుంచి తీసుకున్నారు. కానీ మీడియాకు ఇవ్వకుండా వారే మింగేశారు. దీనివల్ల నా సినిమాను నాశనం చేశారు. ఇలాంటి పి.ఆర్.ఓలను బేన్ చేయండి. అంటూ దర్శకుడు రేంత్ వాపోతున్నారు. ఆయన సినిమారంగంలోని పలువురుని కలిసి తన గోడు విన్నవించుకున్నారు. `మా` అధ్యక్షుడు మంచు విష్ణు, నిర్మాతల మండలి, దర్శకుల సంఘంకు తమ సినిమాను కావాలని నాశనం చేసిన వంశీ శేఖర్ అనే పి.ఆర్.ఓ.లపై ఆయన నివేదిక సమర్పించారు. దీనిని బుధవారంనాడు ఆయన మీడియాకు విడుదల చేశారు.
అడిగితే బెదిరించేవారు.
దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ, నాలుగేళ్ళ మా సినిమా కష్టాన్ని వారు నాశనం చేశారు. మొదట్లో మీలాంటి చిన్న సినిమాలకు పనిచేసే అవకాశం ఇవ్వండని మా వద్దకు వచ్చి బతిమిలాడుకున్నారు. మీడియా గురించి పెద్దగా తెలీని మేం వారికి అవకాశం ఇచ్చాం. ఆ తర్వాత ఫస్ట్‌లుక్, టీజర్ నుంచి వారి ఆలోనలు మారిపోయాయి. అప్పుడు డబ్బులు అడగడం మొదలు పెట్టారు. పైగా లక్షల్లో అడిగారు. దాదాపు 20లక్షలు వారికి మేం ఇచ్చి మోసపోయాం. సినిమా విడుదలకు ముందు 9 వెబ్‌సైట్లు పేర్లు రాయించి వారికి డబ్బులు ఇవ్వాలన్నారు.అందులో వారి స్వంత వెబ్‌సైట్‌లు వుంటాయి. అస్సలు మెయిన్ స్ట్రీమ్ వెబ్‌సైట్లు లేవు. అదేమి అడిగితే బెదిరించేవారు. మీరు మేం అడిగింది ఇవ్వకపోతే మీ సినిమాకు రివ్యూలు సరిగ్గారావని అన్నారు. అలాగే విడుదల తర్వాత వారు చెప్పినట్లే రాయించారు. కానీ అసలు మెయిన్ మీడియా సినిమా గురించి బాగా రాసింది.
ఈ ఫేక్ వెబ్‌సైట్ల రివ్యూల వల్ల మాకు తీరని నష్టం జరిగింది. దర్శకుడిగా నాకు బేడ్ నేమ్ వచ్చేలా చేసిన అలాంటి పి.ఆర్.ఓలను బేన్ చేయాలి. సినిమాలో ఏదైనా సంఘటన చూపిస్తే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గొడవ చేస్తారు. కానీ దర్శకుడికే ఇలా చేస్తే సినిమారంగం స్పందించాల్సిన అవసరం వుంది. భవిష్యత్‌లో చిన్న సినిమాల ప్రమోషన్‌కు లక్షల్లో తీసుకుంటూ నాశనం చేసే ఇలాంటి వారిని ఊరికే వదలను. నా మనోవేదనను తెలియజేస్తున్నారు. అందరూ పి.ఆర్.ఓ.ల గురించి మొత్తం మీడియా గురించి నేను ప్రశ్నించడంలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి.. అంటూ ఆయన వివరించారు.
అవసరమైతే ఎంతదూరమైనా వెళతానని ఆయన స్పష్టం చేశారు.
నాట్యం సినిమాను ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజ్ నిర్మాత, నటి. పి.ఆర్..ఓ.ల వల్ల ఆమెకూ అన్యాయం జరిగిందని తెలిసింది. మరి సినీ పెద్దలు ఏం చర్య తీసుకుంటారో చూడాలి.
ఇదిలా వుండగా, ఈ విషయం తెలిసిన ఇద్దరు నిర్మాతలు ముందుకు వచ్చారు. అందులో `సుందరి` నిర్మాత తమవద్ద కూడా లక్షల్లో తీసుకుని సినిమాను సరిగ్గా పట్టించుకోలేదని విమర్శించారు.
ఇన్నాళ్ళు చాలామంది నిర్మాతలు పి.ఆర్.ఓ.లుఇబ్బంది పడ్డా.. తొలిసారి ఇలా న్యాయం కోసం ముందుకురావడం విశేషం.