Dhanush Jagame tantram, movie
కరోనా లాక్‌డౌన్‌లో సినిమా థియేటర్లు మూసివేయడంతో ఓటీటీ అనేది ప్రేక్షకులకు ఆటవిడుపుగా మారింది. కాగా, ఇప్పుడు వందశాతం సీటింగ్‌తో థియేటర్లు నడవవచ్చని కేంద్రమంత్రి ప్రకటించడంతో చాలా సినిమాలు థియేటర్లవైపు వెళుతున్నాయి. తెలుగులో చాలా సినిమాలు వారం వారం క్యూకడుతున్నాయి. ఇందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లుకూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా కొన్ని సినిమాలు ఓటీటీలో ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి థియేటర్లలో విడుదల చేయడంతో గొడవలు జరుగుతున్నాయి.
ఆమధ్య సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా ఇందుకు ఉదాహరణగా చెప్పకోవచ్చు. ఇప్పుడు ధనుష్ సినిమా `జగమే తంత్రం` థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని, నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో డీల్ ఓకే అయిపోయిందని, త్వరలోనే విడుదల అని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ధనుష్ అభిమానులు మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేయాలంటూ గొడవ గొడవ చేస్తున్నారు. ధనుష్ నటించిన మరో సినిమా కర్ణన్‌ను ఏప్రిల్లో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు వచ్చిన ప్రకటన అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. జగమే తంత్రంను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న ప్రశ్నలు మరింతగా ఉత్పన్నమయ్యాయి.
ఇలాంటి సమయంలో ధనుష్ ట్విట్టర్లోకి వచ్చి జగమే తంత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, తన శ్రేయోభిలాషులు, అభిమానుల్లాగే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాలని తాను కూడా కోరుకుంటున్నానని, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దామని ఒక ట్వీట్ వేసి వెళ్లిపోయాడు. దానిపై సోషల్‌మీడియాలో చర్చ సాగుతుంది.
ఇదిలా వుండగా, ఓటీటీ, థియేటర్ల విడుదలపై వస్తున్న సమస్యలను తెలుగు ఫిలింఛాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ ముందుకు తేగా, తమిళంనేకాదు తెలుగులోకూడా కొన్ని సినిమాలు ముందుగా అగ్రిమెంట్ తీసుకున్న ప్రకారం ఓటీటీలోనే విడుదల చేయాలి. కానీ చాలామంది వాటిని బయటకు చెప్పడంలేదు. వాటిలో పెద్ద హీరోల సినిమాలు కూడా వున్నాయి. సోలోబ్రతుకే సో బెటర్! కూడా ఓటీటీలో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల థియేటర్లలో విడుదల చేశారు. అలా అందరూ చేయలేరు. ఏదిఏమైనా ఇటువంటి సమస్యలకు త్వరలో పరిష్కారం రాగలదు. ముందు ముందు ఓటీటీ అనేది తగ్గిపోవచ్చని అభిప్రాయం మటుకు అందరిలోనూ వుందని పేర్కొన్నారు.