ఒకవైపు సానియా మీర్జా విదేశీ వరుడ్ని కోరుకుని వివాహమాడేందుకు సిద్ధపడుతుంటే, "1942 ఎ లవ్ స్టోరీ" భామ మనీషా కొయిరాలా నేపాలీ వ్యాపారస్తుడ్ని వివాహమాడుతున్నట్లు చెప్పింది. గత వారం రోజులుగా వివాహానికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఎట్టకేలకు తన భావాలతో నేపాలీ వ్యాపారస్తుడైన సమ్రత్ దహాల్ భావాలు కలిశాయనీ మనీషా తెగ సిగ్గు పడిపోతూ చెప్పింది.
ప్రస్తుతం మనీషా కొయిరాలా కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. శుక్రవారం ఖాట్మాండుకు వెళ్లిన తర్వాత వధూవరులిద్దరు ముఖాముఖి మాట్లాడుకుంటారని ప్రముఖ నేపాల్ ఫిలిమ్ డైరెక్టర్ ఖనాల్ తెలిపారు.
పెళ్లాడిన తర్వాత ఏం చేస్తారూ...? అని ఓ తుంటరి విలేకరి అడిగిన ప్రశ్నకు మనీషా సమాధానమిస్తూ, మా కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. కనుక వారి వారసత్వం తీసుకుందామని అనుకుంటున్నా అని చెప్పింది.