Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెండితెర అభినయ సౌందర్య అంజలీ దేవి ఇకలేరు!!

వెండితెర అభినయ సౌందర్య అంజలీ దేవి ఇకలేరు!!
, సోమవారం, 13 జనవరి 2014 (17:52 IST)
File
FILE
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన "అనార్కలి" చిత్రంలో హీరోయిన్‌గా చేసిన అలనాటి అందాల నటి, తెలుగు లోగిళ్ళ సీత అంజలీదేవి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. ఆమెకు వయస్సు 86 యేళ్లు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీత పాత్రలతో సినీ అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని చిరస్థాయిగా నిలిచిపోయిన సినీ ధృవతార అంజలీదేవి.

ఈమె మరణ వార్త ఇటు అభిమానుల్ని, అటు చిత్ర పరిశ్రమను కేవలం వారం రోజులు తిరగక ముందే మరోమారు విషాదంలో ముంచెత్తింది. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో... సీత పాత్ర ద్వారా అంజలీదేవి అలియాస్ అజనీకుమారి అలియాస్ అంజనమ్మ కూడా అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు.

1927 ఆగస్టు 24వ తేదీ తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో అంజలీదేవి జన్మించారు. ఈమె సినిమాల్లోకి రాకముందు ఆమె రంగస్థల నటిగా రాణించారు. రంగస్థల నటిగా ఆమె అసలు పేరు అంజనమ్మ. ఈ పేరును తొలుత అంజనీ కుమారిగా మార్చారు. తర్వాత దర్శకులు సి.పుల్లయ్య ఆమె పేరును అంజలీ దేవిగా మార్చారు.

ఈమె నటించిన తొలి చిత్రం 1936లో తీసిన "రాజా హరిశ్చంద్ర". కానీ, ఆమెకు హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చిన చిత్రం "కష్టజీవి". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ 1940లో నిర్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మూడు రీళ్లు తీసిన తర్వాత ఆగిపోయింది.

ఈ దశలో సి.పుల్లయ్య ఆమెకు కథానాయికగా మరో ఛాన్స్ ఇచ్చారు. 1947లో తాను నిర్మించిన "గొల్లభామ" చిత్రంలో అంజలికి హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఆ చిత్రంలో తాను ప్రదర్శించిన అభినయంతో పాటు.. తన అందంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆమె ఏమాత్రం వెనుదిరిగి చూడలేదు. తెలుగులో 350కి పైగా, 14 తమిళ, మరికొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సువర్ణ సుందరి చిత్రం హిందీలో కూడా హిట్ అవడంతో... అంజలీ దేవి జాతీయ స్థాయిలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో 1940లో అంజలీదేవి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. భర్తతో కలసి అంజలీదేవి అంజలీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. 1955లో తమ సొంత బ్యానర్‌లో "అనార్కలి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు. అలాగే "భక్తతుకారాం", "చండీప్రియా" తదితర సినిమాలను నిర్మించగా, ఇవి మంచి విజయాన్నిసాధించాయి.

అంజలీ దేవి నటించిన చిత్రాల్లో "లవకుశ", "సతీ సావిత్రి", "చెంచులక్ష్మి", "సతీ అనసూయ", "రాజపుత్ర రహస్యం", "జయభేరి", "భక్త ప్రహ్లాద", 'బడిపంతులు', 'సోగ్గాడు', 'అనార్కలి', 'నిరపరాధి' వంటి ఎన్నో అద్భుత చిత్రాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా సినీపరిశ్రమలో తనదైన చెరగని ముద్రవేసి, సినీ రంగానికి అలుపెరుగని సేవ చేసిన అంజలీదేవి మరణం... సినీపరిశ్రమకు తీరని లోటుగా చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu