తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన మంటల వల్ల ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ విషాదం పాత పాల్వంచ తూర్పు బజార్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దంపతులతోపాటు ఒక చిన్నారి సజీవదహనమైంది. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం మేరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.