Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త

bandi sanjay
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మరోమారు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అరెస్టును నిరసనగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
అకారణంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్టు చేసి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సహా భాజపా శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. దీంతో పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. భాజపా కార్యకర్తలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. భాజపా కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో సంజయ్‌ను బొమ్మల రామారం నుంచి వేరే చోటుకు తరలించే అవకాశముంది.
 
మరోవైపు, పోలీసు స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే రఘునందన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సంజయ్‌ను పరామర్శించేందుకు వస్తే తనను అడ్డుకోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను అడ్డుకున్నారన్నారు. బండి సంజయ్‌ను ఏ కేసులో.. ఎందుకు అరెస్టు చేశారో పోలీసులు చెప్పడం లేదని రఘునందన్‌ మండిపడ్డారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బండి సంజయ్‌ అరెస్టుపై భాజపా ముఖ్యనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పారు. ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
 
పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తప్పుదోవ పట్టించేందుకే సంజయ్‌ను అరెస్టు చేశారన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సంజయ్‌ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. 
 
ఇదిలావుంటే, హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా
సంజయ్‌ అరెస్టుపై భాజపా హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్థరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్‌ను న్యాయస్థానంలో హాజరుపరిస్తే మరో పిటిషన్‌ దాఖలు చేసే యోచనలో భాజపా ఉన్నట్లు సమాచారం. హెబియస్‌ కార్పస్‌ బదులు అక్రమ అరెస్టు పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశాలను ఆ పార్టీ  లీగల్‌ సెల్‌ నేతలు పరిశీలిస్తున్నారు. సంబంధిత కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో కాల్పులు.. బీజేపీ నేత అల్లుడి మృతి