Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫార్మాసిటీ అంటేనే కుంభకోణం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Advertiesment
ఫార్మాసిటీ అంటేనే కుంభకోణం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
, సోమవారం, 12 అక్టోబరు 2020 (07:48 IST)
తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్‌‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను ఈ విధంగానే పాడుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలపై తెరాస నేతలు పడ్డారని విమర్శించారు. ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణమని.. అధికార పార్టీ నేతలు డబ్బులు సంపాదించుకునేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
 
సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు అక్రమ ధనార్జనపైనే దృష్టి పెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునే వాడినని.. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయని కేటీఆర్.. ఫార్మాసిటీల పేరుతో శ్మశానవాటికలు కట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రూ.3లక్షల కోట్లు స్వాహా చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో తెరాస ఖాళీ అవుతుందని కోమటిరెడ్డి అన్నారు.
 
నేల తల్లిని నమ్ముకుని బతికే అన్నదాతలకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పచ్చని పొలాలు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఒక దగ్గరే 20 కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు.

ప్రజల పొలాలు వారికే చెందాలి.. వాళ్ల హక్కులు కాపాడాలనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఇచ్చిందని.. ఆ మాటలకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. మరో మూడేళ్ల పాటు భూములను కాపాడుకోవాలని.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏ సమస్యా ఉండదన్నారు. అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ లాంటివి లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తపాలాశాఖలో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌