కరోనా ప్రభావంతో దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఏం కేసీఆర్ 12కిలోల బియ్యం అందిస్తున్న దరిమిలా వారికి ఉప్పు, పప్పులు, చింత పండు తదితర రూ.1250 విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్ధిపేట పట్టణ ప్రధాన వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే
సిద్ధిపేట గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై సోమవారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరారు.
కాగా పట్టణంలోని గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ వెళ్లే రోడ్డున, విక్టరీ టాకీస్ సర్కిల్ నుంచి భారత్ నగర్, ఏనసాన్ పల్లి రోడ్డు వరకూ సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి ప్రత్యేక స్ప్రే వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేయించారు.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్,
మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు.