భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఆమె హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి హోదాలో తొలిసారి వస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బొల్లారం రాష్ట్రపతి హౌస్‌లో ఈ నెల 30వ తేదీ వరకు శీతాకాల విడిది చేస్తారు. ఈ మధ్యకాలంలో శ్రీశైలం, భద్రాచలం తదితర ఆలయాల దర్శనానికి ఆమె వెళతారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గత వారమే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి హాజరయ్యే కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాగా, సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకునే రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘనగా స్వాగతం పలుకనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకునే ఆమె అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత శ్రీశైలానికి బయలుదేరి వెళతారు.
అక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంభిక ఆలయాలను సందర్శిస్తారు. ఈ నెల 28వ తేదీన ములుగు జిల్లాలోని ప్రసిద్ద రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. దీన్ని గత యేడాది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన విషయం తెల్సిందే. అదే రోజు భద్రాచలం ఆలయానికి చేరుకుని స్వామివార్లను దర్శనం చేసుకుంటారు.
ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో కన్హా శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఫతేపూర్‌కపు చెందిన శ్రీరామచంద్రాజీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హర్ దిల్ ధ్యాన్ ఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కూడా ముర్ము పాల్గొంటారు.