హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సైబర్ ముఠా అందమైన అమ్మాయిని ఎరగావేసి రెండు లక్షల రూపాయల వరకు దోచుకుంది. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను ఆశ్రయించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెట్టుగూడకు చెందిన విక్రమ్ అనే యువకుడికి ఇటీవల ఓ విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది. నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది.
పైగా, పెళ్లి కూడా భారత్‌లోవనే చేసుకుందామని తెలిపింది. ఇందుకోసం ఖర్చులు, ఇతరత్రా కోసం రూ.కోట్లలో డబ్బు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి యువకుడి నుంచి రెండు దఫాలుగా రెండు లక్షలకు పైగా డబ్బును తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. నగదు ట్రాన్సఫర్ అయిన తర్వాత సైబర్ కేటుగాళ్ళ ఫోన్లు స్విచ్చాఫ్ అయిపోయాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.