Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

తెలంగాణలో ఆసుపత్రులన్నీ కిటకిట.. బండారు దత్తాత్రేయ

Advertiesment
hospitals
, గురువారం, 29 ఆగస్టు 2019 (19:41 IST)
తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి విషజ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

వానా కాలం ప్రారంభానికి ముందే ప్రభుత్వం త్రాగునీరు పై దృష్టిపెట్టకపోవడం, దోమ తెరల పంపిణీ లాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుతం ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని అన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందని ఆరోపించారు.

బండారు దత్తాత్రేయ, శాసన సభ్యులు టి. రాజాసింగ్, విశ్రాంత ఐఏఎస్ చంద్రవదన్, డాక్టర్ నాగేందర్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని తనిఖీ నిర్వహించి ఆసుపత్రిలోని రోగులతో వారికి అందే వైద్య సౌకర్యాలు మరియు ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లోను అలాగే నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాలలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని అన్నారు.  సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం నష్టనివారణ చర్యలైనా చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 
 
గతంలో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి.. ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని, దీని వెంటనే మరో చోటికి తరలించి ఈ ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో నూతన భావం నిర్మిస్తామని హామీ ఇచ్చి నాలుగేండ్లు గడిచినా హామీ నెరవేర్చే దిశగా ఒక్క అడుగుకూడా ముందుకు సాగలేదని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, కాలు గడపదాటడంలేదని విమర్శించారు. శిథిలావస్థకు చేరిన ఆసుపత్రిలో వైద్యులు మరియు రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రస్తుతం విష జ్వరాల తీవ్రత ఎక్కువ ఉండడంతో జిల్లానుండి సైతం రోగులు పెద్ద సంఖ్యలో రావడంతో సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు.

ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే రూపాయలు వెయ్యి కోట్లు కేటాయించి, అధునాతన సౌకర్యాలతో నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.
 
 నిన్న కేంద్ర మంత్రిమండలి దేశంలో నూతనంగా 75 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేయాలని నిర్ణయించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. 24 వేల కోట్ల రూపాయలతో  ఏర్పాటుకాబోతున్న ఈ కళాశాలలు 2020 సంవత్సరం లోపు పూర్తిచేయాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.

దీనిద్వారా రాబోవు సంవత్సరాలలో అదనంగా 15700 క్రొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దేశ వైద్య విద్యా రంగంలో ఇదొక పెద్ద ముందడుగుగా భావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో వైద్య కళాశాలలు వచ్చే విధంగా కృషి చేయాలనీ అన్నారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే "ఆయుశ్మాన్ భారత్" పధకం ద్వారా 60 వేల కోట్ల రూపాయలతో దేశంలోని 10 కోట్ల మంది మధ్య, దిగువ మధ్యతరగతులవారికి  సంవత్సరానికి 5 లక్షలవరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పధకంలో చేరి రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకి ప్రయోజనాలు కలిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం