ఈ నెల 27వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
అలాగే, పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇకపోతే, రేపు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఈ నెల 4న తెలంగాణను తాకిన విషయం తెల్సిందే. దీంతో తొలకరి వర్షాలు కురిశాయి. ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
దీనికి కారణం రుతుపవనాల్లో కదలికలు లేక ఆకాశం నిర్మలంగా ఉంటోంది. వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. శుక్రవారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది మూడు డిగ్రీలు అదనం. మొదట్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.