Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల రోజుల వాన ఒక్క రోజులోనే.... నీట మునిగిన భాగ్యనగరి

Advertiesment
నెల రోజుల వాన ఒక్క రోజులోనే.... నీట మునిగిన భాగ్యనగరి
, శుక్రవారం, 16 జులై 2021 (08:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, రాజధాని నగరం హైదరాబాద్‌లో నెల రోజుల్లో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే కురిసింది. దీంతో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వర్షాల దెబ్బకు తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. భారీ వర్షాలకు పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
 
అలాగే పంటలకు అపారనష్టం వాటిల్లింది. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మెదక్ జిల్లా చేగుంట, హైదరాబాద్‌లలో గరిష్ఠంగా 21.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాగోలు సమీపంలోని బండ్లగూడ చెరువులోకి వరదనీరు భారీగా చేరడంతో సమీపంలోని అయ్యప్పకాలనీ, మల్లికార్జున నగర్‌లలోని ఇళ్లలోకి నడుములోతులో నీళ్లు చేరుకున్నాయి. దీంతో కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లపోగా, మరికొందరు ఇళ్లపైకెక్కి ప్రాణాలు నిలుపుకున్నారు.
 
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌లో నెల రోజుల్లో నమోదు కావాల్సిన సగటు వర్షపాతం ఒక్క రోజులోనే నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఇక, వికారాబాద్‌ జిల్లా ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్లచిట్టంపల్లిలో బుధవారం కురిసిన వానకు ఇల్లు కూలి షబ్బీర్ అనే వ్యక్తి మరణించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏఖీన్‌పూర్-సంగెం వాగులో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు రక్షించారు. అదే జిల్లాలోని పెద్దవాగులో చిక్కుకున్న ఏడుగురిని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు రక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిహోమ్‌ ఇంట్లోనే కోవిడ్ పరీక్ష : కిట్ అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఐఐటీ