Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్‌కు సరైన మొగుడుని నేనే : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Advertiesment
కేసీఆర్‌కు సరైన మొగుడుని నేనే : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
, శుక్రవారం, 22 జనవరి 2021 (11:39 IST)
తెరాస అధినేత కేసీఆర్‌కు సరైన మొగుడ్ని తానేనని కాంగ్రెస్ సీనియర్ నత జగ్గారెడ్డి అన్నారు. గతంలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఎన్నికలప్పుడు జైల్లో పెట్టించాడని దుయ్యబట్టారు. ఆయనకు తాను ఒక్కడినే సరిపోతానని, రానున్న జడ్పీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై ఆయన్ను నిలదీస్తానన్నారు.
 
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్‌ జైల్లో పెడతానని అంటాడే గానీ.. కేసీఆర్‌ చేసిన తప్పేంటో చెప్పడని అన్నారు. ఏం ఆధారం ఉందని జైల్లో పెడతారని.. టీఆర్‌ఎస్‌ వాళ్లూ అడగరని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుపైనా బండి సంజయ్‌ మాట్లాడట్లేదని, వాటి అమలు కోసం పోరాటమూ చేయడం లేదని గుర్తు చేశారు. 
 
ఒకరి హామీలను ఒకరు అడగకూడదన్నదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని ఆరోపించారు. అలాగే, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పగలు కొట్టుకుంటూ రాత్రి మాట్లాడుకుంటాయని, దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకూడదన్నదే ఈ మూడు పార్టీల వ్యూహమన్నారు.
 
తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్‌, దేవుళ్ల పేరుతో బీజేపీ, ముస్లింలను రెచ్చగొడుతూ ఎంఐఎం.. రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు ఎల్లకాలం ఇలానే ఉండాలని, దానిపైన రాజకీయం చేస్తూ బతకాలని ఈ మూడు పార్టీలూ అనుకుంటున్నాయన్నారు. 
 
ఇకపోతే, 'ప్రాంతీయ పార్టీల్లో తండ్రి తర్వాత కొడుకునే సీఎంను చేసే సంప్రదాయం ఉంది. ఎవరైనా కొడుకును కాదని అల్లుడిని సీఎం చేస్తారా?' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎం మార్పు అన్నది తెరాస ఇంటి పంచాయితీ అని, కేసీఆర్‌.. ఎవరిని సీఎం చేస్తడన్నది ఆయన ఇష్టమన్నారు. 
 
అయితే, తెలంగాణాలో సీఎం మార్పు అన్నది కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్‌లోనే జరుగుతుందన్న అనుమానాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయం ఎటు తిరిగినా దాని వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వ్యూహం ఉంటుందన్నారు. 
 
కేటీఆర్‌ను సీఎం చేయడంవల్ల బీజేపీకి చాలా ఉపయోగం ఉంటుందని, అప్పుడు కొత్త ఆటను ప్రారంభిస్తుందన్నారు. రాజకీయంగా కొత్త కోణంలో ప్రజల్ని మోసం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే వారి అజెండా అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెను భారాన్ని భరించలేం.. బస్సు చార్జీలు పెంచాల్సిందే : తెలంగాణ ఆర్టీసీ