Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ మరో కర్ణాటక: టీఆర్ఎస్ నేతల్లో గుబులు

Advertiesment
తెలంగాణ మరో కర్ణాటక: టీఆర్ఎస్ నేతల్లో గుబులు
, శనివారం, 17 ఆగస్టు 2019 (12:27 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతల్లో బిజెపి గుబులు రేపుతోంది. తమ శాసనసభ్యులకు బిజెపి గాలం వేస్తున్నట్లు ప్రచారం ఊపందకోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ ను మించిన వ్యూహకర్తగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను భావిస్తున్నారు. దీనివల్ల బిజెపి తెలంగాణలో ఏదైనా చేయవచ్చునని అంటున్నారు.
 
అయితే, టీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసేందుకు మాత్రం బిజెపి నాయకత్వం పకడ్బందీ వ్యూహరచనే చేసినట్లు అర్థమవుతోంది. బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు శుక్రవారం ఓ సమావేశంలో అన్నారు.

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చినట్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీన అమిత్ షా తెలంగాణ వస్తున్నారు. ఆ రోజు విస్తుపోయే పరిణామం చోటు చేసుకుంటుందని కూడా మురళీధర్ రావు అన్నారు. అదేమిటో ఆయన చెప్పలేదు. 

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం. దీన్ని అధికారికంగా నిర్వహించడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు. దాన్ని ఆసరా చేసుకుని రాజకీయాన్ని నడిపే ఉద్దేశంతో మాత్రం బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది.
 
తమ నాయకత్వంతో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బహిరంగ వేదికపై నుంచి ప్రకటించారు. మురళీధర్ రావు కూడా అదే విషయం చెప్పారు.

దీంతో టీఆర్ఎస్ నుంచి ఎవరెవరు, ఎంత మంది బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చ ప్రారంభమైంది. అసలు బిజెపి కేవలం మైండ్ గేమ్ ఆడుతుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నేతలు పలువురు నాయకత్వంతో విసిగిపోయారని, పార్టీలో వారికి స్వేచ్ఛ లేకుండా పోయిందని బిజెపి నేతలు ప్రచారం సాగిస్తూ వస్తున్నారు.

ఈ స్థితిలో బిజెపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుందనే ప్రచారం ముమ్మరమైంది. ఇది టీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కేసీఆర్ విశ్వాసపాత్రుడు వినోద్ కుమార్ ఓటమి పాలు కావడం తీవ్ర కలవరానికి గురిచేసిందనే చెప్పాలి.
 
అయితే, కర్ణాటకలో అనుసరించిన వ్యూహం తెలంగాణలో పనికి రాదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంత సులభం కాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉందని, తెలంగాణలో బిజెపికి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడని, అందవల్ల కర్ణాటక మోడల్ తెలంగాణలో పనికి రాదని వాదిస్తున్నారు. పైగా శాసనసభలో టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ ఉంది. 
 
కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
 
ట్రిపుల్ తలాక్ బిల్లుపై, ఆర్టికల్ 370 రద్దుపై, డ్యామ్ సేఫ్టీ బిల్లుపై ఓటింగు సమయంలో బిజెపి నాయకులు టీఆర్ఎస్ ఎంపీలతో మాట్లాడారు. తెలంగాణలో తమ బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వారు టీఆర్ఎస్ ఎంపీలతో అన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత బిజెపి తన వ్యూహాలను తెలంగాణలో ఆచరణలోకి తేనున్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చాలా వరకు తమకు అనుకూలంగా ఉంటాయని కూడా బిజెపి నేతలు భావిస్తున్నారు. 2023నాటికి తెలంగాణలో పాగా వేస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆ మధ్య హైదరాబాదు వచ్చినప్పుడు చెప్పారు. ఇదిలావుంటే, బిజెపి వ్యూహాలను కట్టడి చేయడానికి కేసీఆర్ తగిన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ రావడానికి కూడా బిజెపి నుంచి ఎదురవుతున్న సవాల్ వల్లనే అని కూడా అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెల్లుబుకుతుందనే భయం కేసీఆర్ కు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడు గనుక బిజెపి రంగంలోకి దిగితే పరిస్థితి చేజారిపోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కేసీఆర్ కు ఎసరు పెట్టేందుకు ఏ చిన్న అవకాశం లభించినా వదలకూడదనే ఉద్దేశంతో బిజెపి నేతలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో జగన్.. రాష్ట్రంలో పెట్టుబడికి.. ఒకే ఒక్క ఫామ్ నింపితే చాలు