తమ కుమారుడుకి ఆగస్టు నెలలో వివాహం చేసేందుకు ఆ తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. వారు ఒకటి తలస్తే.. విధి మరొకటి తలచింది. యువకుడుని చెట్టు రూపంలో వచ్చిన మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు. చిన్నబోయినపల్లికి చెందిన ఎస్కే జహంగీర్ (30) బీటెక్ చదువుకుని బతుకుదెరువు కోసం గ్రామంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మందులు తీసుకువచ్చేందుకు చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారానికి 163 జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతుండగా పోతురాజు బోరు వద్ద రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలి జహంగీర్ మీద పడింది.
ఈ ప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దారి వెంట వెళుతున్న వారు గమనించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్ఐ సిబ్బందితో సహా వచ్చి చెట్టును తొలగించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు షేక్ సయ్యద్ దంపతులకు వివాహమైన కూతురు సల్మా, చిన్న కొడుకు జాహీద్ ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.