Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy
, బుధవారం, 13 డిశెంబరు 2023 (08:34 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రాష్ట్రంలోని పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. 
 
ఈ విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొత్తకార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
2014 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో లక్షలాదిమంది పేదలు వాటికోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వద్ద కూడా వేలాది దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీనికితోడు పేరు మార్పులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పించడం, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు.. ఇలా ఎన్నో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే రేషన్ కార్డుల కోసం సుమారుగా 1.25 లక్షల దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు కలిపి 90.14 లక్షల కార్డులున్నాయి.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా వంటి పథకాలకు రేషన్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించడంతోపాటు కొత్త వాటికి జారీకి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మారిపోతున్న వాతావరణం.. పెరిగిపోతున్న చలి తీవ్రత