Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సభలో హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

revanth reddy

ఠాగూర్

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (14:56 IST)
దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సభలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌ నుంచి తరిమికొడితే.. మహబూబ్‌నగర్‌ వాసులు ఎంపీగా గెలిపించారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను ఎమ్మెల్యే హరీశ్‌ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్‌ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు.
 
మరోవైపు కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అవకాశమిచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్‌ ఇచ్చిందని హరీశ్‌ ఆరోపించారు. 
 
పీపీటీ కోసం తమకూ అవకాశమివ్వాలని కోరామని.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశమివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, భారాస విజయమని తెలిపారు. మంగళవారం భారాస ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ఈ ప్రకటన చేశారని.. తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
 
హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వినలేదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. 
 
భారాస పుణ్యమాని వ్యవసాయం సంగతి అటుంచితే.. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీశ్‌ రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సేద్యాన్ని నమ్ముకున్నందుకు పెళ్లిళ్ళు కావడం లేదు... సీఎంకు రైతుల మొర