Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

jeevan reddy

ఠాగూర్

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (08:35 IST)
కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోని వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన (పార్టీ ఫిరాయించిన) వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. 
 
ఇటీవల జగిత్యాలలో తన ముఖ్య అనుచరుడు హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన తన సొంత పార్టీ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా, ఆర్టీపీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ఆవేదనను పరిగణలోకి తీసుకుంటారని, పార్టీ మీద నమ్మకంతోనే అధిష్ఠానానికి తాను ఫిరాయింపులకు సంబంధించి లేఖ రాశానన్నారు.
 
రాహుల్ గాంధీ ఆలోచనలు, తమ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగానే తాను ఫిరాయింపులపై మాట్లాడానన్నారు. రాహుల్ గాంధీపై తనకు నమ్మకం ఉందన్నారు. ఏఐసీసీ అనుమతితోనే చేరికలు జరిగాయన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కూడా జీవన్ రెడ్డి స్పందించారు. పెద్దల అనుమతి ఉండవచ్చని... కానీ రాహుల్ గాంధీ ఆలోచననే తాను చెప్పానన్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా నైతిక విలువలు ఉండాలన్నారు.
 
త్యాగాల పునాదులపై కాంగ్రెస్ ఈ స్థాయికి వచ్చిందన్నారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని, కానీ నైతిక విలువల విధానం కావాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ కాలికి బలపం పట్టుకొని తిరిగి దేశమంతా కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
 
ఫిరాయింపులపై వెంటనే చర్యలు ఉండాలని రాహుల్ గాంధీ కూడా చెప్పారు కదా... అంటే ఆయన మాటకు ఇక్కడి ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... ఫిరాయింపుల వెనుక ఎవరు ఉన్నారో చూద్దామన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తన ఆవేదనను వ్యక్తం చేశానన్నారు. నా ఆలోచనకు, నా ఆవేదనను పార్టీ గుర్తిస్తుందని నమ్మకం ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీరందాటిన 'దానా' తుఫాను... ఒరిస్సా - బెంగాల్‍‌ రాష్ట్రాలు అతలాకుతలం