Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన్మాష్టమి రోజున ఇలా పూజ చేస్తే.. శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే?

సెప్టెంబర్ రెండో తేదీన శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి వస్తోంది. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లున్నాయి. అల

Advertiesment
Janmashtami
, బుధవారం, 29 ఆగస్టు 2018 (13:31 IST)
సెప్టెంబర్ రెండో తేదీన శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి వస్తోంది. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లున్నాయి. అలాంటి మహిమాన్వితమైన రోజున శ్రీ కృష్ణ భగవానుడిని పూజించడమే కాకుండా శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించాలి.
 
శ్రీ కృష్ణాష్టమి వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండపురాణం, స్కాందపురాణం, మార్కండేయ పురాణాల్లో కనిపిస్తోంది. పూర్వం నారద మహర్షి ఓ సారి సత్యలోకానికి చేరుకుని బ్రహ్మదేవుడిని దర్శించి.. స్వామిని శ్రీకృష్ణాష్టమి మహాత్మ్యమును గురించి వివరించాల్సిందిగా కోరాడు. ఆ సమయంలో నారదునికి స్వామి శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని గురించి తెలిపాడు.
 
ఈ రోజున శ్రీకృష్ణుని పేరును స్మరించినంతనే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలై.. పుణ్య ఫలాలు కలుగుతాయి. అలాంటి శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించాలి. ఆరోజున పగలంతా ఉపవాసం వుండి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ గడిపి వ్రతం చేయాలి. పూర్వం అంబరీషుడు, శిశుపాలుడు, గాధిమహారాజు వంటివారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గొప్పవారయ్యారు ఎందరో మహామునులు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణులోకాన్ని పొందారు.
 
ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల భయాలు తొలగిపోతాయి. వ్యాధులు నయమవుతాయి. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని బ్రహ్మదేవుడు నారదునికి వివరించాడు. ఈ వ్రతం గురించి తెలుసుకున్న నారదుడు.. సకల లోక వాసులకు ఈ వ్రతాన్ని గురించి తెలియజేసినట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఈ వ్రతం ఆచరించేవారు.. శ్రీకృష్ణాష్టమి ముందురోజు రాత్రి ఉపవాసం వుండి పవిత్రంగా గడపాలి. శ్రీకృష్ణాష్టమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి.. నువ్వులపిండిని శరీరానికి, ఉసిరిక పిండిని తలకు రుద్దుకుని.. తులసీ దళాలతో కూడిన నీటితో స్నానమాచరించాలి. ఇంటిల్ల పాది శుభ్రం చేసుకుని.. పూజా మందిరాన్ని సుందరంగా అలంకరించుకోవాలి. 
 
చిన్ని పాదాలను గుర్తించుకోవాలి. తర్వాత ఆచమనం చేసి ఉపవాసం వుండి వ్రతం కోసం సంకల్పించుకోవాలి. శ్రీకృష్ణుడిని పూజించాలి. పగలంతా ఉపవాసం వుండటం ద్వారా సప్తజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అగ్ని పురాణం చెప్తోంది. శ్రీకృష్ణ వ్రతం చేయడం ద్వారా వెయ్యి గోవులను దానం చేసిన ఫలం కలుగుతుందని విశ్వాసం. 
 
శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీమద్భాగవతం దశమస్కందంలోని శ్రీకృష్ణ జననం, బాల్య క్రీడలు వంటి వాటిని చదవటం లేదా వినడం చేయాలి. ఆ రోజు సాయంత్రం పూట తిరిగి స్నానమాచరించి, ఇంట్లోని పూజా మందిరాన్ని, ఇంటిలో వ్రతం చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పూజా పీఠంపై బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి.
 
పీఠం మధ్యభాగంలో బియ్యం పోసి, బియ్యంపైన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని, చిత్ర పటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. నీరు, ఇనుము, కత్తి, గుమ్మడి పండు, పోకపండు, కరక్కాయ, మారేడు పండు, దానిమ్మ పండు, జాజి పండు, కొబ్బరి పండు, జింజీర ఫలం వంటి వాటిల్లో ఏవైనా ఎనిమిదింటిని వుంచాలి. 
 
ముందుగా గణపతి పూజ చేసి.. తర్వాత శ్రీకృష్ణుడిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. పాలు, మీగడ, వెన్న, పెరుగు, నెయ్యి, చక్కెర కలుపుకోవాలి. శక్తి మేరకు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఆపై వ్రతకథను చదివి అక్షతలు వేసి నమస్కరించాలి. ఇలా వ్రతాన్ని పూజించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి. మరుసటి రోజు తిరిగి స్వామిని పూజించి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ప్రతి ఏడాది శ్రీకృష్ణాష్టమి నాడు వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (29-08-19) దినఫలాలు - మిత్రులు అవసరాలు తీరాక...