Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరో వన్డే‌లో ఇంగ్లాండ్‌పై 2 వికెట్ల తేడాతో భారత్ విజయం

ఆరో వన్డే‌లో ఇంగ్లాండ్‌పై 2 వికెట్ల తేడాతో భారత్ విజయం
, గురువారం, 6 సెప్టెంబరు 2007 (12:28 IST)
నాట్‌వెస్ట్ సిరీస్ కీలకమైన ఆరో వన్డే‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ అందించిన 317 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 3-3తో సమం అయింది.

12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఊతప్ప (47, 8 ఫోర్లు) చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి నాలుగు ఫోర్లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్‌కు ఓపెనర్లు సౌరవ్ గంగూలీ (53), సచిన్ టెండూల్కర్ (94) మరోసారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించారు.

తొలి వికెట్‌గా గంగూలీ వెనుదిరిగిన అనంతరం వచ్చిన గౌతం గంభీర్‌ (47) కాస్త తేడాతో అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆరు పరుగుల తేడాతో వన్డే‌ల్లో 42వ సెంచరీ చేజార్చుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ భారత్ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషించాడు. ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సచిన్ ఈ మ్యాచ్‌లో 83వ అర్థ సెంచరీ సాధించి ఇంజమామ్ పేరిట ఉన్న అత్యధిక అర్థ సెంచరీల రికార్డును సమం చేశాడు.

సచిన్ రెండో వికెట్‌గా వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌పై ఇంగ్లాండ్ పట్టుబిగించడం ప్రారంభించింది. భారీ లక్ష్యం కావడంతో భారత్ బ్యాట్స్‌మెన్ కూడా తడబడ్డారు. ధోనీ (35) 48వ ఓవర్‌లో చివరి బంతికి బౌల్డవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే అప్పటికే క్రీజ్‌లో ఉన్న ఊతప్ప చివరి ఓవర్‌ మూడు, నాలుగు బంతులను ఫోర్లుగా మలిచి ఉత్కంఠకు తెరదించాడు. దీనితో భారత్‌కు అపురూప విజయం లభించింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, మస్కారెన్హాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, పనేసర్, ఓవైస్ షా చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఓవైస్ షా చెలరేగి ఆడాడు.

షా (95 బంతుల్లో 107, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ, ఆల్‌రౌండర్ ల్యూక్ రైట్ (50), పీటర్సన్ (52) అర్థ సెంచరీలు చేయడంతో భారత్ ముందు ఇంగ్లాండ్ 317 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. షా, మాస్కారెన్హాస్ (36) క్రీజ్‌లో నాటౌట్‌లుగా మిగిలారు. చివరి ఓవర్లలో వీరిద్దరు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖరి ఓవర్ చివరి ఐదు బంతులను మాస్కారెన్హాస్ సిక్స్‌లుగా మలిచి ఇంగ్లాండ్ స్కోరును 300 దాటించాడు.

ఇంగ్లాండ్ చివరి పది ఓవర్లలో 114 పరుగులు పిండుకుంది. ఈ సిరీస్‌లో తొలిసారి పీటర్సన్ (53) భారత బౌలర్లకు పరీక్ష నిలిచి అర్థ సెంచరీ సాధించాడు. పీటర్సన్‌, మరో అర్థ సెంచరీ చేసిన ల్యూక్ రైట్‌లు రనౌట్‌లు అయ్యారు. వీరిద్దరితో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ కెప్టెన్ కాలింగ్‌వుడ్ కూడా రనౌటయ్యాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, పీయూష్ చావ్లా తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu