Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్‌పై ప్రశంసలు చాలు.. ఇక ఆపండి: పాక్ మీడియాకు తాలిబన్ హెచ్చరిక!

సచిన్‌పై ప్రశంసలు చాలు.. ఇక ఆపండి: పాక్ మీడియాకు తాలిబన్ హెచ్చరిక!
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసల జల్లు కురిపించడాన్ని మానకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఏకె 47 ఆయుధాలతో ముఖానికి ముసుగువేసుకున్న కొందరు వ్యక్తులతో కలిసి తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ మాట్లాడిన ఓ వీడియోను తాలిబన్ విడుదల చేసింది.

భారతదేశానికి చెందిన ఒక ఆటగాడు సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని, ఆయనపై ప్రశంసలు చేస్తూ పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరమని తాలిబన్ నేత షాహిద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే అదే మీడియా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌పై విమర్శలు చేయడం దారుణమని తెలిపారు.

సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ అతడు భారతీయుడు అనే విషయాన్ని గుర్తుంచుకుని అతనిపై ప్రశంసలు కురిపించాల్సిన అవసరం లేదని చెప్పారు. మిస్బా ఉల్ హక్ ఎలా ఆడాడు అనేది ముఖ్యం కాదని, అతడు ఓ పాకిస్థానీ కాబట్టి అతనిపై ప్రశంసలు కురిపించవచ్చని అన్నారు.

కాగా పాకిస్థాన్ మీడియా సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్‌ను పూర్తిగా కవర్ చేయడమే కాకుండా అతని చివరి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా ఆ దేశంలోని అభిమానులకు అందించింది. నవంబర్ 16 తర్వాత సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలిక నాటి నుంచి అతనిపై పాక్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

‘సచిన్ టెండూల్కర్ లేని క్రికెట్ ఆట పేదది అవుతుంది' అనే శీర్షికన ఓ పత్రిక ఘనమైన వీడ్కోలు పలికింది. సచిన్ టెండూల్కర్ తన 25ఏళ్ల ఆట ద్వారా ప్రపంచంలోని అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడని మరో పత్రిక డాన్ పేర్కొంది. ఇలా పాక్ మీడియాలన్నీ మూకుమ్మడిగా సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో తాలిబన్ పాకిస్థాన్ మీడియాపై అక్కసును వెళ్లగక్కుతూ.. హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu