భారత్-దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమం చేసుకోవడం, ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌ను గెలుచుకున్న టీమిండియాను గాయాల బెడగ వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా సెహ్వాగ్, గంభీర్ లాంటి కీలక భారతీయ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరం కాగా, ఇప్పుడు ఆ జాబితాలోకి పేస్ బౌలర్లు ప్రవీణ్ కుమార్, శ్రీశాంత్‌లు కూడా చేరారు.
బుధవారం జరిగే మ్యాచ్‌లో వీళ్లు ఆడేది అనుమానమే. అయితే 11 నెలల తర్వాత సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. తద్వారా ఈ వన్డే సిరీస్‌కు మాస్టర్ బ్లాస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. చివరిసారిగా గ్వాలియర్ వన్డేలో సచిన్ వన్డే చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే, వచ్చే నెల 19నుంచి భారత ఉపఖండంలో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్, దక్షిణాఫ్రికాలు ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడంతో రెండు జట్లు కూడా సిరీస్‌లో భాగంగా జరిగే అయిదు వన్డే మ్యాచ్‌ల ద్వారా జట్టులో ఎవరు ఉండాలో నిర్ధారించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
అలాగే ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయిన యువరాజ్ సింగ్ ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించగల సత్తా ఇప్పటికీ తనలో ఉందని సెలెక్టర్లకు తెలియజేయడానికి ఇదే చివరి అవకాశమని చెప్పాలి. బుధవారం మ్యాచ్‌లో పేస్ బౌలర్ జహీర్‌ఖాన్, స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు ఆడడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక దక్షిణాఫ్రికా జట్టులో కల్లిస్ లేక పోవడం స్మిత్ సేనకు పెద్ద లోటే. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన కల్లిస్ ప్రపంచ కప్ నాటికి కోలుకోవచ్చని తెలుస్తోంది. అయితే కెప్టెన్ స్మిత్‌తో పాటుగా ఆమ్లా, డివిలియర్స్, జెపి డుమిని లాంటి ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడంతో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది.
ఇక బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్స్, మోర్కెల్‌లు టెస్టుల్లోలాగానే వన్‌డేలలోను భారత ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా.. దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్కసారి కూడా గెలుపును నమోదు చేసుకోని భారత్, ఈ వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.