శ్రీలంకతో సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఫామ్‌లేమితో ఇటీవల కెప్టెన్సీ కోల్పోయిన క్రిస్ గేల్ సోమవారం పరుగుల మోత మోగించాడు. శ్రీలంకతో సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో గేల్ (247 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 219) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు.
క్రిస్ గేల్ డబుల్ సెంచరీతో తొలి టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ 362/2 పరుగుల భారీ స్కోరు సాధించింది. 116 బంతుల్లో 'శత'క్కొట్టిన గేల్ మరో 105 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. బరాత్ (50)తో కలిసి తొలివికెట్‌కు 110, బ్రావో (58)తో రెండోవికెట్‌కు 194 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రస్తుతం గేల్‌కు తోడు చందర్‌పాల్ (20) క్రీజులో ఉన్నాడు.