Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పల్ టెస్టులో భజ్జీ శతకం: భారత్‌కు 122 పరుగుల ఆధిక్యం

ఉప్పల్ టెస్టులో భజ్జీ శతకం: భారత్‌కు 122 పరుగుల ఆధిక్యం
భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ మరోమారు బ్యాటింగ్‌లో మెరిశాడు. తన స్పిన్ మాయాజాలంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను కట్టడి చేసిన భజ్జీ.. భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేశాడు. రెండు వరుస టెస్టుల్లో వరుసగా సెంచరీ చేయడమే కాకుండా, టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 472 పరుగులకు ఆలౌటైంది. దీంతో 122 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన భజ్జీ.. శ్రీశాంత్‌తో కలిసి పదో వికెట్‌కు ఏకంగా 105 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది క్రికెట్ ప్రపంచ చరిత్రలో అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 436 పరుగులు చేయగా, ఈ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్... మరో 36 పరుగులు జత చేసిన తర్వాత అన్ని వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో భజ్జీ 105 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, రెండో ఎండ్‌లో ఉన్న శ్రీశాంత్ తన వ్యక్తిగత స్కోరు 24 వద్ద వెట్టోరి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భజ్జీ మాత్రం 111 పరుగులతో ఆలౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వెట్టోరి ఐదు వికెట్లు తీయగా, సౌథీ మూడు, మార్టిన ఒక్కో వికెట్ చొప్పున తీశాడు.

అంతకు ముందు భారత తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ 96, గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, రాహుల్ ద్రావిడ్ 45 చొప్పున పరుగులు చేయగా, ఉప్పల్ టెస్టులో అర్థ సెంచరీల శతకాన్ని పూర్తి చేస్తాడని భావించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నిరాశకలిగిస్తూ 13 పరుగులకే అవుట్ అయ్యాడు. అలాగే, సురేష్ రైనా 20, ధోనీ 14 పరుగులు చేయగా, జహీర్ ఖాన్ 7, ఓఝా డకౌట్ అయ్యాడు. కివీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu