అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరైన టీం ఇండియా మాజీ కెప్టెన్, కోల్‌కత ప్రిన్స్ సౌరవ్ గంగూలీ ఓ టెలివిజన్ రియాలిటీ షోకు క్విజ్ మాస్టర్‌గా సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. "జీ బంగ్లా" అనే ప్రముఖ బెంగాలీ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ఓ రియాలిటీ షోలో దాదా "దాదాగిరి" చేయనున్నాడు.
ఈ విషయమై ప్రముఖ బెంగాళీ దినపత్రిక "ఆనంద బజార్ పత్రిక" ఓ వార్తా కథనం వెలువరించింది. వారానికోసారి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి, జీ బంగ్లా ఛానెల్‌వారి ప్రతిపాదనను తాను అంగీకరించాననీ, క్విజ్ షోను ఎలా నిర్వహించాలో ఇప్పటికే తెలుసుకున్నానని గంగూలీ చెప్పినట్లుగా ఆ కథనం పేర్కొంది.
రియాలిటీ షోకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకాలు కూడా దాదా ఇప్పటికే సంతకాలు కూడా చేసేశారని పై పత్రికా కథనం వెల్లడించింది. మొదట 72 ఎపిసోడ్ల దాకా ప్రసారం చేయనున్న ఈ క్విజ్ కార్యక్రమం బాగా పాపులర్ అయిన తరువాత మరింతగా పెంచే ఆలోచనలో జీ బంగ్లా ఉన్నట్లు ఆనంద బజార్ పత్రిక వెల్లడించింది.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమానికి "దాదాగిరి" అనే పేరును ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆనంద బజార్ పత్రికా కథనం తెలియజేసింది.