అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సముచిత స్థానం కల్పించింది. బీసీసీఐ సాంకేతిక కమిటీ సభ్యునిగా కోల్‌కతా ప్రిన్స్‌ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గుంగూలీకి 20 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉందని, దాన్ని సాంకేతిక కమిటీలో ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
క్రికెటింగ్ విషయాల్లో, నియమాల మార్పులు నిర్ణయాలు తీసుకునే అత్యంత శక్తివంతమైన కమిటీ అది. టెక్నికల్ కమిటీకి సునీల్ గవాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. చేతన చౌహాన్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంవీ.శ్రీధర్, బిమన్ భట్టాచార్జీ, మిలింద్ రేగే, జ్ఞానేంద్ర పాండే, వికె.రామస్వామి, ఎన్.శ్రీనివాసన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.