పారిస్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత్‌కు మరో పతకం లభించింది. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజతం సాధించాడు. తాను వరుసగా పాల్గొన్న రెండో ఒలింపిక్ క్రీడాపోటీల్లో కూడా పతకం సాధించి సరికొత్త చరిత్రను లిఖించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో రజతాన్ని ముద్దాదాడు. సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటాడు. అయితే, అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించారు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో రెండో స్థానంలో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ చరిత్రకెక్కాడు. క్వాలిఫయర్ రౌండ్‌లో 89.34 మీటర్ల తో విసిరి ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే ఫైనల్లో మొదటి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో నీరజ్ చోప్రాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆ తర్వాత త్రోకి అద్భుతంగా పుంజుకొని బల్లేన్ని ఏకంగా 89.34 మీటర్ల దూర విసిరాడు. అయితే అంతకంటే ముందే పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల తో విసిరాడు. చోప్రా మరింత ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.
మరోవైపు, ఈ ఒలింపిక్ క్రీడా పోటీల్లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. చోప్రా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని, అతడొక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మరో ఒలింపిక్స్‌లోనూ అతడు ప్రతిభ చాటడంతో భారత్ హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. రజతం సాధించిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్ తరాల అథ్లెట్లను నీరజ్ చోప్రా ప్రోత్సహిస్తూనే ఉంటాడని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.