స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలిసింది. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన మెస్సీ.. పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ (పీఎస్జీ)తో మంగళవారం కొత్త కాంట్రాక్ట్‌కు అంగీకారం తెలిపాడని సమాచారం.
ఈ ఒప్పందం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశం కూడా పీఎస్జీ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంట్రాక్ట్‌పై మెస్సీకి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. అతడి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
లియోనల్ మెస్సీ మంగళవారం ఉదయం బార్సిలోనా విమానాశ్రయానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:30 ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు విమానంలో బయలుదేరాడు. ఈ సమయంలో మెస్సీతో పాటు అతడి భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అతని తండ్రి జార్జ్, మెస్సీ ప్రతినిధి కూడా పారిస్‌కు వెళ్లారు. పారిస్ సెయింట్ జర్మైన్ క్లబ్ (పీఎస్జీ)తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మెస్సీ ఫ్రాన్స్ వెళ్లాడు. గత కొద్ది రోజులుగాపీఎస్జీతో మెస్సీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
లియోనెల్ మెస్సీ ఇటీవలే స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగతి తెలిసిందే. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్లబ్.. మెస్సీ లాంటి ఖరీదైన ఆటగాన్ని కొనసాగించడం అసాధ్యం. పైగా మెస్సీ తన ఫీజును మరో 30 శాతం పెంచాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ పుకార్లను మెస్సీ ఖండించాడు.
'జీతం పెంచడం కాదు.. 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బార్సిలోనాలోనే కొనసాగడానికి ప్రయత్నించాను' అని మెస్సీ ఫేర్‌వెల్ సందర్భంగా చెప్పాడు. అయితే జీతం 50 శాతం తగ్గించుకోవడం కాదు.. అసలు ఫ్రీగా ఆడతానన్నా అతడు బార్సిలోనాలో కొనసాగడం కుదరదని రూల్స్ చెబుతున్నాయి.