బర్మింగ్‌హ్యామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో 19 యేళ్ల కుర్రాడు సరికొత్త రికార్డు సృష్టించి, పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి పట్టులోనే 154 కేజీల బరువు ఎత్తిన జెరెమీ... రెండో ప్రయత్నంలో 160 కేజీల బరువు ఎత్తేశాడు. దీంతో మొత్తంగా 300 కేజీల బరువు ఎత్తి ఓవరాల్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇదిలావుంటే వెయిట్ లిఫ్టింగ్‌లో 55 కేజీల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నగదు పురష్కారాన్ని ప్రకటించారు. సంకేత్‌కు రూ.30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. అలాగే, ఆయన ట్రైనర్‌కు రూ.7 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనున్నట్టు మహారాష్ట్ర సీఎంవో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.