వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు గుడ్ బై చెప్పింది.
రిటైర్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. యాష్లే బార్టీ టెన్నిస్ ప్లేయరే కాకుండా ఓ ప్రోఫెషనల్ క్రికెటర్ కూడా.
ఈ నేపథ్యంలో ఆటకు గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నానని తెలిపింది. తనకు మిగతా కలల్ని కూడా నెరవేర్చుకోవాలని బార్టీ ఉద్వేగపూరితంగా మాట్లాడింది.
అయితే, 25 ఏళ్ల వయస్సులోనే, కెరీర్ టాప్ పీక్స్‌లో ఉన్న సమయంలో బార్టీ రిటైర్‌మెంట్ ప్రకటన అభిమానులను షాక్‌కు గురి చేసింది.
ఇక యాష్లే బార్టీ కెరీర్ విషయానికొస్తే.. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన బార్టీ తద్వారా కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించింది.
ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో మహిళా ప్లేయర్(ఆస్ట్రేలియన్)గా బార్టీ రికార్డు సృష్టించింది.