Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతానాన్నిచ్చే చల్లని తల్లి "కామాక్షమ్మ"

Advertiesment
పర్యాటక రంగం
FILE
దుర్వాస మునీంద్రుని క్రోధాగ్నిని చల్లార్చిన చల్లని తల్లి, స్వయంగా ఇంద్రుడి చేత, ఆదిశంకరుడి చేత పూజలు చేయించుకున్న ప్రత్యక్ష దైవం "శ్రీ మల్లికార్జున కామాక్షి తాయారు" అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం వెలసిన ప్రాంతంలో త్రేతాయుగంలో కశ్యపుడు యజ్ఞం చేశాడనీ, అందువల్ల ఇది యజ్ఞవాటికగా ప్రసిద్ధి చెందిందనీ పురాణ గాథల్లో చెప్పబడింది. ఈ ప్రాంతాన్నే వేదాద్రి అని కూడా పిలుస్తుంటారు.

నెల్లూరు పట్టణానికి దగ్గరలో, పినాకినీ నదీమతల్లి ఒడ్డున ఉండే జొన్నవాడ గ్రామంలో వెలసిన ఈ కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేనివారు ఈ ఆలయంలో నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనీ.. మానసిక రుగ్మతలు కలవారు, చెవిటి, అవిటివారు కూడా ఇక్కడ కొద్దిరోజులు నిద్రిస్తే వారికి కూడా మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో నిద్రించేవారు అమ్మవారు రాత్రివేళల్లో తమతో మాట్లాడుతున్న అనుభూతికి లోనవుతారని చెబుతుంటారు. ఈ విశ్వాసంతో చాలామంది భక్తులు కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులవుతుంటారు. భక్తులందరికీ అభయహస్తాన్ని అందిస్తున్న ఈ అమ్మవారు పినాకినీ నదీమతల్లి ఒడ్డున కొలువుదీరటాన్ని ఆ ప్రాంతవాసులందరూ ఒక వరప్రసాదంగా భావిస్తుంటారు.
దేవేంద్రుడే పూజించాడట..!
దేవేంద్రుడు వృషవర్యుడనే రాక్షసుడి కిరాతకాలను భరించలేక, తన దేవతా బృందాలతో హిమాలయా పర్వతాలలో కొంతకాలం గడిపారట. ఆ సమయంలో దేవేంద్రుడు కామాక్షి అమ్మవారి మహిమలను తెలుసుకుని జన్నవాడ క్షేత్రానికి వచ్చి ఆమెను పూజించి, ఆమె అనుగ్రహం పొంది ఆ రాక్షసుడిని అంతం...
webdunia


ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే... కశ్యప మహర్షి అమ్మవారి ఆలయం వెలసిన ప్రాంతం యజ్ఞం చేసేందుకు అనువైనదని భావించి.. "కార్హ స్పత్యము" అనే అగ్నిని ఏర్పాటు చేసి.. తూర్పు దిశగా పినాకినీ నదిని, దక్షిణాన ఆవాహనీయమనను అగ్నిని, వేదాద్రివైపు దక్షిణాగ్నిని ఏర్పాటు చేశారట. వాటినే త్రేతాగ్నులుగా పిలుస్తారు. వాటి ద్వారా కశ్యపుడు తన యజ్ఞాన్ని పరిపూర్ణంగా పూర్తి చేశాడట.

అప్పుడు మూడువైపులనుంచి అగ్నిగుండాల నుండి గార్హగుండం నుండి వెలువడిన తేజస్సు అన్ని దిశలకూ వ్యాపించటంతో.. ఈశ్వరుడు మల్లికార్జునుడి రూపంలో ఇక్కడ అవతరించినట్లు పురాణ గాథలలో చెప్పినట్లు ఆలయ చరిత్రలో వివరించారు. కైలాసంలో ఈశ్వరుడు కనిపించక పోవటంతో కలతచెందిన పార్వతీదేవి అన్ని లోకాలనూ వెదకుతూ జొన్నవాడ క్షేత్రానికి చేరుకుని స్వామివారిని కలిసిందట.

ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉందని, దీనిని వదలివెళ్లాలంటే మనస్కరించటం లేదని.. నువ్వు కూడా ఇక్కడే ఉండి కామాక్షిదేవిగా దర్శనమిస్తూ ప్రజలను కాపాడమని పరమేశ్వరుడు పార్వతిని అడిగాడట. అందుకు అంగీకరించిన ఆమె ఇక్కడే కొలువైనట్లు స్కంద పురాణంలో ఈ క్షేత్ర మహిమను వివరించినట్లు తెలుస్తోంది.

అలాగే... దేవేంద్రుడు వృషవర్యుడనే రాక్షసుడి కిరాతకాలను భరించలేక, తన దేవతా బృందాలతో హిమాలయా పర్వతాలలో కొంతకాలం గడిపారట. ఆ సమయంలో దేవేంద్రుడు కామాక్షి అమ్మవారి మహిమలను తెలుసుకుని జొన్నవాడ క్షేత్రానికి వచ్చి ఆమెను పూజించి, ఆమె అనుగ్రహం పొంది ఆ రాక్షసుడిని అంతం చేశాడట.

అశ్వత్థాముడు కూడా తన కుష్టురోగ నివారణ కోసం కామాక్షి అమ్మవారిని పూజించి, పినాకినీ నదిలో స్నానం చేసి తన వ్యాధిని నిర్మూలించుకున్నాడట. అలాగే కవి తిక్కన 13వ శతాబ్దంలో మహా భాగవత రచన ప్రారంభించేందుకు ముందు ఈ ప్రదేశంలో యజ్ఞంచేసి తన రచనను కొనసాగించాడని చెబుతుంటారు.

అదలా ఉంటే... ప్రతిరోజూ వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చే ఈ అమ్మవారి ఆలయంలో అనునిత్యం వివిధ రకాల పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన అతి పురాతనమైన తులసికోటకు ఎంతోమంది భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలాగే చాలామంది భక్తులు ఈ ఆలయంలో నిద్ర చేసి వెళ్తుంటారు. వీరికి ఆలయ నిర్వాహకులు అనేక సౌకర్యాలను కల్పిస్తారు కూడా..!

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పది రోజులపాటు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారిని, స్వామివారిని వివిధ ఆభరణాలతో అలంకరించి ఊరేగిస్తారు. ఆఖరి రోజున పినాకినీ నదిలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులను అలరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజంశాఖ పినాకినీ నదిలో బోట్ షికారుతోపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నెల్లూరు నుంచి జొన్నవాడకు బస్సు సౌకర్యంతోపాటు ఆటోలు, ట్యాక్సీలు కూడా లభిస్తాయి. నెల్లూరు పట్ణణంలో చూడదగ్గ ఇతర ప్రదేశాల విషయానికి వస్తే... పినాకినీ నది ఒడ్డునే ఉన్న శ్రీరంగనాయకుడి ఆలయం కూడా తప్పక చూడదగిన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. అలాగే జొన్నవాడ దగ్గర్లో ఉన్న వేదాద్రిలో వెలసిన నరసింహస్వామివారి ఆలయం కూడా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu