శ్రీభగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీరామానుజాచార్యులకు అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనుంది.
శ్రీరామానుజాచార్యుల విశేష సేవలకు నివాళిగా వచ్చే ఏడాది మే నెల వరకు ఉత్సవాలు 106 దివ్యదేశాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రథయాత్రలు, శ్రీనివాస కల్యాణాలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామానుజ సంచార రథంతో పాటు కల్యాణరథం కూడా ఉత్సవమూర్తులను తీసుకుని వెళ్లనున్నాయి. రథాలను తితిదే రవాణా విభాగం సిద్ధం చేసింది. ఉత్సవాలను ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఇందుకోసం గవర్నర్ దపంతలు సోమవారమే తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.