తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ముక్కంటి ఈశ్వరుని దర్శించుకునేందుకు శైవక్షేత్రాల వద్ద బారులు తీరారు.
కార్తిక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.
ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
అలాగే, నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పుణ్యక్షేత్రంలో బారులుతీరారు. రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం, హోమం, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.
అదేవిధంగా ఏపీలోని శ్రీకాళహస్తిలో కూడా భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయన భక్తులతో కిటకటలాడుతుంది. మహిళా భక్తులు దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే, ఈశ్వరుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు.