కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం!
శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భూలోకమైన వైకుంఠమైన భద్రగిరిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆ తర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. మంగళసూత్రధారణ తర్వాత సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. సీతరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. కాగా, సీతారాముల వారి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని పెళ్లికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించారు.