సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం
, సోమవారం, 24 డిశెంబరు 2007 (18:09 IST)
సంతానం భగవత్ ప్రసాదితం. తమకు పుట్టిన శిశువు కేరింతలు దంపతుల జీవితంలో మరపురాని క్షణాలుగా మిగిలిపోతాయి. సంతానాన్ని పొందడంతో జీవిత పరమార్థం నెరవేరుతుందని ప్రజల విశ్వాసం. సంతానం లేని వారి వేదన మాటలకందనిది. ఎవరి అంచనాలకు చేరుకోనిది.తండ్రి కావాలని తాపత్రయపడే మానవుడు దేనికైనా సిద్ధపడతాడు. దేవుని ముందు శిరస్సు వంచి ప్రణమిల్లుతాడు. కొన్నిసార్లు వైద్యులను ఆశ్రయిస్తే, మరికొన్ని సార్లు మోసగాళ్ళ వలలో పడతాడు. ఈ నేపథ్యంలో ఏది నిజం శీర్షికలో భాగంగా ఇండోర్‌లోని అంబావాలీ మాత దేవాలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. సంతానం కోరుకునే ప్రజలు ఇక్కడ తమ శిరస్సులు వంచుతారు. ఈ దేవాలయంలో కాళ్‌రాత్రి మాత ప్రధాన దేవతగా పూజలందుకుంటోంది.దేవాలయం విశిష్టత తెలియగానే రాత్రి 10 గంటల ప్రాంతంలో మేము ఈ దేవాలయానికి చేరుకున్నాము. భారీ సంఖ్యలో చేరిన భక్తసమూహం మాకు అక్కడ కనిపించింది. వారిలో కొందరు సంతాన భాగ్యం కోసం చేరుకోగా, మరికొందరు తమ కోరిక తీర్చినందుకుగాను కాళ్‌రాత్రి మాతకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు దేవాలయానికి విచ్చేసారు.వివాహం జరిగి పది సంవత్సరాలు కావొస్తున్నా తమకు సంతానం కలగలేదని భక్తులలో ఒకరైన సంజయ్ అంబారియా మాతో అన్నారు. స్నేహితులలో ఒకరు దేవాలయ మహత్యాన్ని తనకు తెలిపారని సంజయ్ వెల్లడించారు. ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం కొంత కాలానికి తమకు సంతాన
భాగ్యం కలిగిందని సంజయ్ చెప్పుకొచ్చారు.
ఇక్కడ మొక్కులు తీర్చుకునే విధానం విభిన్నంగా ఉంటుంది. మొదటగా తమకు సంతాన భాగ్యం ప్రసాదించాలని అమ్మవారిని కోరుతూ మూడు కొబ్బరి కాయలను సమర్పించుకుంటారు. అనంతరం సంతానం కోరుకునే భక్తులు ఐదు వారాల పాటు మెడలో ధరించేందుకుగాను ప్రత్యేకమైన దారాన్ని పూజారి అందిస్తారు. తమకు సంతానభాగ్యం కలిగిన వెంటనే దేవాలయ ఆవరణలోని చెట్టుకు ఐదు కొబ్బరికాయలను భక్తులు కడతారు. చెట్టుకు కొబ్బరికాయలు కట్టే నిమిత్తం సంజయ్ అంబారియా ఇక్కడకు వచ్చారు.
కాళ్‌రాత్రి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు సంజయ్ అంబారియా తరహా భక్తులు వేలాదిగా ఇక్కడకు వచ్చి కొబ్బరి కాయలను చెట్టుకు కడతారు.కాళ్‌రాత్రి అమ్మవారి దేవాలయమైనందున ఇక్కడ అమ్మవారి పూజలను రాత్రి పూట నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి పూరన్ సింగ్ పర్మర్ మాతో అన్నారు. అమ్మవారి పట్ల సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఇక్కడకు వచ్చే భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని పూజారి నమ్మబలికారు. ఈలోగా ప్రత్యేక 'హారతి'కి సమయం కావడంతో పూరన్ సింగ్ పూజాకార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. హారతి సమయంలో 'మౌలీ'గా పిలవబడే దారాన్ని పూజలో ఉంచారు. మౌలీని భక్తులు ఐదు వారాలపాటు తమ మెడలో ధరించాలని అక్కడి వారు మాతో అన్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగానే కొందరు భక్తులు ఊగడం మొదలుపెట్టారు. అదేసమయంలో పూజారి మహిళా భక్తులకు కొబ్బరి కాయలను అందించసాగారు. అందరి మనస్సులోనూ తమ కోరికలు నెరువేరుతాయన్న అచంచలమైన విశ్వాసం చోటు చేసుకుంది.తనకు తప్పకుండా శిశువు జన్మిస్తుందని భక్తురాలైన విమలా సేన్‌గర్ మాతో అన్నారు. దేవాలయానికి సంబంధించిన అతి ముఖ్యమైన వాస్తవాన్ని మనం
తెలుసుకోవలసి ఉంది. అదేమిటంటే... అమ్మవారి కృపతో ఎవరైనా దంపతులకు ఆడ శిశువు జన్మించినట్లయితే, ఆ శిశువును సాక్షాత్తూ దుర్గా మాత అవతారంగా భావిస్తారు.
అందుకేనేమో మగ శిశువుకు బదులుగా తమకు ఆడ శిశువు జన్మించాలని ఇక్కడకు వచ్చిన దంపతులు అమ్మవారిని కోరుకుంటారు. ఆలయంలో పూజలు చేస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకాన్ని గురించి మీరేమి అనుకుంటున్నారు?