లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల
, ఆదివారం, 11 నవంబరు 2007 (19:21 IST)
ఆంజనేయ స్వామి భక్తులకు నయనానందం కలిగిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా విన్నూత్నమైన ప్రదర్శనశాల లక్నోలో ఏర్పాటైంది. ఆంజనేయ స్వామికి చెందిన అరుదైన వస్తువులతో నిండిన ఈ ప్రదర్శనశాల 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్'లో స్థానం సంపాదించుకుంది. ఈ బృహత్కార్యం సాకారం వెనుక హనుమత్ భక్తుడైన సునీల్ గొంబార్ కృషి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆంజనేయస్వామికి అనేక వస్తువులను సునీల్ సేకరించారు. లక్నోలోని ఇందిరానగర్‌లో గల తన నివాసమైన 'బజ్‌రంగ్ నికుంజ్' మొదటి అంతస్తులో తను సేకరించిన వస్తువులను సునీల్ ప్రదర్శనకు ఉంచారు. శ్రీరామచంద్రుని 48 గుర్తులను కలిగిన 'చరణ్ పాదుక'(అడుగు జాడలు)ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా వెండితో అలంకరించబడి ఉన్నాయి. శ్రీరాముడు స్మరించిన హనుమంతుని సహస్ర నామాలను (వెయ్యి పేర్లు) కూడా మీరు చూడవచ్చు. ఈ
నామాలు సంస్కృతంలోని 'హనుమాన్ సహస్రనామ స్తోత్రం' హిందీ అనువాదం నుంచి గ్రహించబడ్డాయి. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సునీల్ గొంబార్ సేకరించిన 600 పై చిలుకు అరుదైన ఆంజనేయ స్వామి చిత్రాలలో కొన్ని 17 శతాబ్ద కాలం నాటివి. అరుదైన అంజనీపుత్రుని విగ్రహాలు సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రదర్శన శాల గోడలపై వాయునందనుని భక్తి ప్రపంచం చెక్కబడి ఉన్నది. ఈ శిల్పాలలో హనుమంతుని పరివారం, సీతారాములు, లక్ష్మీదేవి, మారుతి తండ్రి కేసరి, తల్లి అంజని, గురువు సూర్యభగవానుడు, వాయు దేవుడు కనిపిస్తారు. అంతేకాక పవనసుతుని స్నేహితులైన సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నలుడు, జాంబవంతుని చిత్రాలు కూడా ఇక్కడి శిల్పాలలో చోటు చేసుకున్నాయి. గోస్వామి తులసీదాస్ కూడా శిల్పాకృతిలో హనుమంతుని భక్తి ప్రపంచంలో కనిపిస్తారు.ఈ ప్రదర్శనశాలలో ఆంజనేయ స్వామి భక్తి పాటలను కలిగిన పలు రకాల సీడీలు, క్యాసెట్‌లు దర్శనమిస్తుంటాయి. 250 పుస్తకాలతో పాటు హనుమంతుని ఆభరణాలైన కిరీటం, కర్ణాభరణాలు, గద, పతాకం, సింధూరం ఇక్కడ కనిపిస్తుంటాయి. ఆంజనేయ స్వామి భక్తి భావనా వాహినిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన సాధుపుంగవులు నీమ్ రౌలీ బాబా, గురు సమర్థ రామదాసు చిత్రాలు తదితరాలు కూడా స్థానం సంపాదించుకున్నాయి. ఆంజనేయస్వామి కోసం నిర్మితమైన 137 వెబ్‌సైట్ల సమాచారాన్ని ప్రదర్శనశాలలో పొందుపరిచారు. మూడు సంవత్సరాల క్రితం అనగా 2004 సంవత్సరం, నవంబర్
21న ఈ ప్రదర్శనశాల అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించుకున్నది.ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.రామచరిత్ మానస్‌లోని ఏడు అధ్యాయాలను ఆధారంగా చేసుకుని హంగేరీకి చెందిన హుమిల్ రోజెలియా (రాధికాప్రియా) రూపొందించిన అద్భుతమైన తైలవర్ణ చిత్రాలు సందర్శకులకు నేత్రపర్వంగా నిలుస్తున్నాయి. 1864 సంవత్సరంలో మహరాజా రంజిత్ సింగ్ జారీ చేసిన ఆంజనేయ స్వామి చిత్రాలను కలిగిన నాణేలు ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి.
వానరాన్ని పోలినట్లుగా నిర్మితమైన మారుతి అరుదైన విగ్రహాన్ని ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు. మరొక విగ్రహంలో చేతులలో పతాకాన్ని ధరించి, ఒంటెను అధిరోహించియున్న పవనసుతుని దర్శించుకోవచ్చు. ఇక బాలహనుమానుని సుందర మానుష విగ్రహం అద్భుతమైన భక్తిభావనను సందర్శకులలో రేకెత్తిస్తుంది. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామిపై వెలువడిన రచనల భాండాగారాన్ని సునీల్ ఈ ప్రదర్శనశాలలో నెలకొల్పారు. ప్రచురణల సంస్థకు చెందిన సునీల్, ఏడవ తరగతి చదువుతండగానే ఆంజనేయ స్వామి ప్రభావానికి లోనయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం ముక్కు నుంచి రక్తం కారడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది. ప్రదర్శనశాలతో పాటు 'జై భజరంగ్' పేరిట దాతృత్వ సంస్థను సునీల్ స్థాపించారు.అంతటితో ఆగక హనుమంతునిపై తాను రచించిన సాహిత్యాన్ని నాలుగు పుస్తకాల రూపంలో సునీల్ ప్రచురించారు. వాటిలో 'తులసీదాస్ హనుమాన్ సాధన శబ్దమణి' అత్యధిక అమ్మకాలకు నోచుకుంది. అంతటి ప్రజాదరణ పొందిన రచనలలో 'హనుమాన్ దర్శన్', 'సుందర కాండ సుందర్ క్యోం', 'భక్తోం కా దృష్టికోణ్ అండ్ వరల్డ్ ఆఫ్ లార్డ్ హనుమాన్' తలమానికంగా నిలుస్తున్నాయి.హనుమత్ భక్తులకు సునీల్ ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నారు. ఆంజనేయ స్వామికి చెందిన వస్తువులు లేదా సమాచారాన్ని తనకు పంపవలసిందిగా
ఆయన భక్తులను అభ్యర్థిస్తున్నారు. తన ప్రదర్శనశాలలో వాటి బాగోగులను చూసుకుంటానని సునీల్ హామీ ఇస్తున్నారు. రామభక్త హనుమాన్ ప్రదర్శనశాల ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.
ప్రదర్శనశాల చిరునామా:
భజరంగ్ నికుంజ్, 14/1192, ఇందిరా నగర్, లక్నో.
ఫోన్ నెం: 0522-2711172, మొబైల్ నెం: 09415011817
రచన.. అరవింద్ శుక్లా, లక్నో.