Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంచారామ క్షేత్రాలు ఎలా పుట్టాయో? తెలుసా?

Advertiesment
ఆధ్యాత్మికం
WD
రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

పూర్వం ముక్కంటి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడ్డాయని, ఆ ఐదు క్షేత్రాలే పంచారామములైనాయని పురాణాలు చెబుతున్నాయి.

"శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః" - స్కాందపురాణ

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలైనాయని స్కాంద పురాణం పేర్కొంటోంది.

అవే 1. దాక్షారామము (ద్రాక్షారామము, తూ||ో|| జిల్లా) - భీమేశ్వరుడు
2. కుమారారామము (సామర్లకోట, తూ||ో|| జిల్లా) - భీమేశ్వరుడు
3. క్షీరారామము (పాలకోల్లు, ప||ో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
4. భీమారామము (భీమవరం, ప||ో|| జిల్లా) - సోమేశ్వరుడు
5. అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు - ఈ ఆలయాల్లోని శివలింగాలను దేవతలు ప్రతిష్టించినవని స్థల పురాణాలు చెపుతున్నాయి.

ఇకపోతే.. శ్రీనాథుడు (15 శతాబ్దము) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఇలా చెప్పియున్నాడు. పూర్వం సముద్ర మధనంలో లభించిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి దేవతలకు, రాక్షసులకు పంచిపెడుతుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు జపతపములను ఆచరించారు.
WD


వీరి జపములకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వరములను ప్రసాదిస్తాడు. కొత్తగా సంపాదించిన వరాల శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేస్తారు. ఇలా రాక్షసులకు హింసలకు గురైన దేవతలు చేసేది లేక ముక్కంటి అయిన ఈశ్వరునినే శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద గావిస్తాడు.

అలా ఏర్పడిన రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధిచెందింది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహాదేవుడు ఐదు ముక్కలుగా చేధించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. ఇలా లింగ ప్రతిష్ట చేసిన ఈ ఐదు ప్రదేశములే "పంచారమములు"గా ప్రసిద్దికెక్కాయని భీమేశ్వర పురాణం చెబుతోంది.

అయితే స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశిపుని కుమారుడు నీముచి. ఈ నీముచికి తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరుడి అనుగ్రహం సంకల్పించి ఘోర తపస్సు చేశాడు.

ఈ తపస్సుకు ప్రతిఫలంగా పరమేశ్వరుని ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులచే తనకు మరణం సంభవించకూడదనే వరం కూడా పొందాడు.

బాలుడు తననేం చేయగలడనే ధీమా, అహంతో తారకాసురుడు ముల్లోక దేవతలను నానా హింసలు పెట్టేవాడు. ఆ దానవుడి హింసకు భరించలేని దేవతలు ముక్కంటి ప్రార్థించడం, తారకాసురుడిని వధించడం కోసం పరాక్రమశాలి అయిన శివబాలుడు-కుమార స్వామి ఉదయించడం జరుగుతుంది.

పరమేశ్వర రక్షణతో బహు పరాక్రమశాలిగా అవతరించిన కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరిస్తాడు. ఆ సమయంలోనే తారకాసురుని గొంతులోని ఆత్మలింగం ముక్కలై.. ఐదు ప్రదేశాల్లో పడిందని అవే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని స్కాంద పురాణం చెబుతోంది.

మొత్తానికి పంచారామ క్షేత్రాలను సందర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాల్లోని ప్రతి లింగానికి ఓ ప్రత్యేకత ఉందని, దానిని గుర్తించి లింగేశ్వర ఆరాధన చేసేవారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మరి మీరు కూడా.. పంచారామ క్షేత్రాలను పుణ్యఫలం కోసం దర్శించుకుంటారు కదూ..!.

Share this Story:

Follow Webdunia telugu