టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఉచితంగా భూమి ఇవ్వాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని బీఆర్ నాయుడు అన్నారు. ప్రపంచ దేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారని.. వారి సౌకర్యార్థం దేశంలోని పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్పో (ఐటిసిఎక్స్)లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్ర ప్రధాన నగరాల్లో, అన్ని దేశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ 27,000 దేవాలయాలను నిర్వహిస్తుందని, ఏటా 21 కోట్ల మంది యాత్రికులు వస్తారని, ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు.