Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి సేవకుల కౌంట్లలో లడ్డూల షార్టేజీ... ప్రతినెలా లక్షల్లో నష్టం...!

శ్రీనివాసుని లడ్డూ ప్రసాద వితరణలో శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని, తద్వారా ప్రసాద వితరణలో జరుగుతున్న అక్రమాలకు అరికట్టాలని భావించిన తితిదే ఈఓ సాంబశవరావు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

Advertiesment
శ్రీవారి సేవకుల కౌంట్లలో లడ్డూల షార్టేజీ... ప్రతినెలా లక్షల్లో నష్టం...!
, సోమవారం, 22 ఆగస్టు 2016 (13:36 IST)
శ్రీనివాసుని లడ్డూ ప్రసాద వితరణలో శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని, తద్వారా ప్రసాద వితరణలో జరుగుతున్న అక్రమాలకు అరికట్టాలని భావించిన తితిదే ఈఓ సాంబశవరావు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. దశలవారీగా కొన్ని నెలల నుంచి మొత్తం 10 కౌంటర్లను శ్రీవారి సేవకులతోనే నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు ఫిష్టులలో 90 మంది సేవకులు పనిచేస్తున్నారు. ఒక్కో కౌంటర్‌కు ముగ్గురు సేవకులుంటారు. అంటే షిప్టుకు 30 మంది పనిచేస్తుంటారు.
 
శ్రీవారి సేవకులు నిర్వహిస్తున్న లడ్డూ కౌంటర్లలో రోజూ 50 నుంచి 100 లడ్డూల దాకా లెక్కతేలడం లేదని తెలుస్తోంది. దీని వల్ల తితిదేకి ప్రతినెలా 50 వేల రూపాయల దాకా నష్టం వాటిల్లుతోంది. అనుభవం లేకపోవడం వల్ల ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ లడ్డూలు ఇచ్చేయడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. లడ్డూలకు సంబంధించి దాదాపు 25 రకాల లడ్డూ టికెట్లు ఉన్నాయి. దివ్యదర్శనం, వైకుంఠం, ఆన్‌లైన్‌-300, ఆన్‌లైన్‌-50, ఎల్‌పిటి, సుప్రభాతం, తోమాల, అర్చన, నిజపాద దర్శనం, వసంతోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అంగ ప్రదక్షిణ, సీనియర్‌ సిటిజన్‌, సుపథం, శ్రీవారి సేవకులు, స్కౌట్స్, ఎన్‌ఆర్‌ఐ, టూరిజం, డోనర్‌, విఐపి బ్రేక్‌ ఇలా రకరకాల టికెట్లు.. టికెట్టు కేటగిరీని బట్టి ఒకటి నుంచి 20 లడ్డూల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. లడ్డూల స్టాకు దించుకోవడం టికెట్లను స్కాన్‌ చేసుకోవడం, భద్రపరుచుకోవడం, లడ్డూలు లెక్కించి భక్తులకు అందజేయడం, మళ్ళీ అన్ని టికెట్లను కేటగిరీల వారీగా విభజించి లెక్కసరిచూసి అధికారులకు అప్పగించడం.. ఈ పనంతా చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల తరపున పనిచేస్తున్న కౌంటర్లలో ఒక్కోదాంట్లో ఒక ఉద్యోగి పనిచేస్తుంటారు. ఇదే పనిని ఒక కౌంటర్‌లో ముగ్గురు శ్రీవారికి సేవకులకు అప్పగించారు. అయినా లడ్డూల్లో షార్టేజ్‌ వస్తోంది. 
 
రెగ్యులర్‌ ఉద్యోగులకైతే ఏ టికెట్టుకు ఎన్ని లడ్డూలు ఇవ్వాలనేది సులభంగా తెలుస్తుంది. ఒకేసారి మూడు నాలుగు టికెట్లు తీసుకోవడం, వాటికి ఇవ్వాల్సిన మొత్తం లడ్డూల సంఖ్యను తప్పుగా లెక్కించుకుని ఎక్కువ ఇచ్చేయడం వంటి వాటి వల్ల ఒక్కో కౌంట్‌లో రోజులో మూడు నుంచి 5 లడ్డూల దాకా లెక్క తేడా వస్తోంది. ఈ విధంగా రోజుకు 50 నుంచి 100 నెలకు, 1500 నుంచి 3వేల దాకా తేడా వస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 50 లడ్డూలే తగ్గుతున్నాయనుకున్నా నెలకు 1,500 లడ్డూలవుతాయి. ఒక్కో లడ్డూ 25 రూపాయల లెక్కన 37,500 రూపాయలు నష్టం వాటిల్లుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 150 లడ్డూలు దాకా షార్టేజ్‌ వస్తున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల కౌంటర్లలో లడ్డూల పగిలిపోవడం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉన్న లడ్డూలను జాగ్రత్తగా తీసి భక్తులకు అందజేయాలి. పగిలిపోయిన వాటిని తీసుకోవడానికి భక్తులు ఇష్టపడరు. 
 
అలాంటి వాటిని పక్కనపెట్టేయాలి. వీటిని పోటుకు పంపి తిరిగి లడ్డూలుగా తయారు చేస్తారు. దీని వల్ల ఆర్థికంగా నష్టమేమీ లేదుగానీ అదనపు పని అవుతుంది. అందుకే కొందరు అధికారులు శ్రీవారి సేవకుల కౌంటర్ల పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ఇలాంటిచోట రెగ్యులర్‌ సిబ్బంది ఉండడమే సరైనది అంటున్నారు. అక్రమాలను అరికట్టడానికి శ్రీవారి సేవకులను నియమించడం మార్గం కాదని అంటున్నారు. రోజూ లెక్కతేలని లడ్డూల వివరాలను ఈఓ పంపుతున్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సంతృప్తికర సేవలు అందించడమే లక్ష్యంగా ఉన్న తితిదేకి ఈ నష్టం పెద్దగా కనిపించకపోవచ్చుగానీ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా పది కౌంటర్లలో శ్రీవారి సేవకుల ప్రయోగం విజయవంతమైతే అన్ని కౌంటర్లలోను వారితోనే నిర్వహించాలన్నది తితిదే యోచన. అలా అన్ని కౌంటర్లలో నిర్వహిస్తే నష్టం కూడా పెరుగుతుంది. ఈ అనుభవంతో ఈఓ సాంబశివరావు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కంటీశుని ప్రసాదం కాస్త పెట్టండి.. ప్లీజ్‌..