Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది: ధృతరాష్ట్రునికి సంజయుడు, విదురుడి తిట్ల పురాణం!

Advertiesment
Significance of viduraneethi
, బుధవారం, 27 మే 2015 (18:44 IST)
మహాభారతంలో సంజయరాయబారానికి ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. సంజయుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని హస్తినాపురానికి చేరాడు. ధృతరాష్ట్రుని అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చెంతన కూర్చుని జరిగిన విషయాన్ని వివరించాల్సిందిగా అడిగాడు. సంజయుడు.. మహారాజా! ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం అడిగాడు.. అన్నాడు. 
 
ధృతరాష్ట్రుడు ''సంజయా.. ధర్మరాజు అతని సోదరులు క్షేమమేనా? అతని బంధుమిత్రులు అతని పట్ల ప్రీతిగా మెలగుతున్నారు కదా'' అని అడిగాడు. సంజయుడు "మహారాజా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమే. ధర్మరాజుకు దైవ చింతన మెండు. ఇంకా అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కనుక భారం నీ మీద పెట్టాడు. నీవు నీ కొడుకులను నమ్మావు. అతడేమో కర్ణుని, శకుని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు.
 
కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరకుంటారా? లోకంలో ఎవరికి కొడుకులు లేరా కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరయినా ఉంటారా? ప్రజలంతా నిన్ను తిడుతుంటే వినలేక చెవులు తూట్లు పడుతున్నాయి. నువ్వూ , నీకుమారులు శకుని ఆడించినట్లు ఆడుతున్నారు. 
 
పాండవులు మంచి వారు కాబట్టి సరిపోయింది. లేకుంటే మీరంతా ఈ పాటికి నాశనం అయ్యివుండేవారు. సుయోధనుడు, ధర్మరాజు శాంతగుణంతో ఉన్నాడు పిరికివాడు అనుకుంటే పొరపాటే. ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు. కనుక మీరు బతికిపోయారు. లేకుంటే ఈపాటికి మీరు ప్రాణాలతో ఉండే వారు కాదు. ''జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది''. అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది. ధర్మరాజు మెత్తని పులి, అవసరం వచ్చినప్పుడు అతడు తిరగబడితే అతనిని ఆపగలవారు లేరు" అన్నాడు.
 
ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడిని మందిరానికి పిలిపించి " విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మనసు వికలమయింది నిద్ర రావడం లేదు " అన్నాడు. విదురుడు "ధృతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీనుడు, ఇతరుల డబ్బు అపహరించేందుకు కాచుకుని కూర్చుకున్నవాడు, సంపదను పోగొట్టుకున్న వాడు, కామంతో కైపెక్కిన వాడు నిద్రపట్టక అవస్థలు పడతారు. వీటిలో నీకు ఏ దోషం ఉంది. ఇతరుల సొమ్మును నీవొక్కడివే అపహరించాలని అనుకున్నావు అందుకే నీకు నిద్ర రావట్లేదు'' అన్నాడు. 
 
ధృతరాష్ట్రుడు "అది కాదు విదురా! ధర్మరాజు మనోగతం అవగతం కాక నిద్ర రావడం లేదు అన్నాడు. విదురుడు " రాజా! నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని అతనికి అప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దుకోండి. ధర్మరాజు నిన్ను పెదనాన్నవైనా తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు.

నీవు రాజ్యభారాన్ని దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద మోపడం మంచికి కాదు అది నీకూ తెలుసు" అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. " విదురా! రేపు సభలో సంజయుడు చెప్పినది విని మాకు ఏది క్షేమమో అది చేయించు. ఇప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృత వచనం నా మీద కురిపించు" అన్నాడు. అప్పుడు విదురుడు తన నీతి వాక్యాలను ధృతరాష్ట్రునికి వినిపించాడు. 

Share this Story:

Follow Webdunia telugu