Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. పాపాలు తొలగిపోతాయి..

నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో కార్తీక మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను వివరించాల్సిందిగా కోరారు. సూత మహర్షి కూడా శౌనకాది మహామునులకు కార్తీక మాసంలో చేపట్టే వ్రతం గు

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. పాపాలు తొలగిపోతాయి..
, శనివారం, 21 అక్టోబరు 2017 (10:09 IST)
నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో కార్తీక మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను వివరించాల్సిందిగా కోరారు. సూత మహర్షి కూడా శౌనకాది మహామునులకు కార్తీక మాసంలో చేపట్టే వ్రతం గురించి చెప్పసాగారు. పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ప్రాణనాథా.. సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించాల్సిందిగా కోరింది. 
 
పరమేశ్వరి కోరిక మేరకు పరమేశ్వరుడు ఓ వ్రతం గురించి చెప్పుకొచ్చారు. పూర్వం మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకున్నారు. ఆపై మహామునివర్యా.. ఈ రాకతో తామందరం పవిత్రులమయ్యాం. మీ రాకకు గల కారణం ఏమిటని కోరారు. దశరథుని కోరికను విన్న వశిష్ట మహాముని తాను మహాయజ్ఞము చేయాలనుకుంటున్నానని.. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చానని చెప్పారు. 
 
వశిష్టుడు కోరినదల్లా దశరథుడు ఇచ్చారు. తన అదృష్టం కొద్దీ మహాయజ్ఞానికి సాయం అందించాను. అయితే ఏడాదిలోని అన్నీ మాసాల కంటే కార్తీక మాసమే ఎందుకు పవిత్రమైనది అని అడిగారు. ఆ మాస గొప్పదనాన్ని వివరించాల్సిందిగా దశరథుడు వశిష్టుడిని కోరుతారు. దశరథుని కోరిక మేరకు వశిష్టుడు కార్తీక మాస గొప్పదనాన్ని చెప్పసాగారు. కార్తీక మాసంలో తాను చెప్పబోయే వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు.
 
ఇది సకల పాపాలను హరించేదని చెప్పారు. ఈ మాసం 30 రోజులు వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కరించుకుని.. వ్రతాన్ని ఆచరించాలి. 
 
కార్తీకంలోని 30 రోజులు పుణ్య తీర్థంలో కానీ.. ఇంట్లోనైనా స్నానమాచరించి శ్రీమన్నారాయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. 
 
తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. కార్తీక మాసం చివరి రోజున అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. 
 
అదే రోజు సాయంకాలం సంధ్యావందనం చేసి, శివ లేదా విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 21-10-17