Publish Date: Mon, 17 Nov 2014 (18:12 IST)
Updated Date: Mon, 17 Nov 2014 (18:16 IST)
కార్తీక అమావాస్య అయిన ఈ నెల 22వ తేదీన పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును, బిల్వదళాలతో శివుడినీ, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు, తర్పణాలు ఇవ్వడం మంచిది.
ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ, వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు.
కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.